ఎన్‌ఐఏ విచారణతో కలకలం
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:44 AM
నంద్యాల జిల్లాలో శుక్రవారం జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నిర్వహించిన విచారణ కలకలం రేపుతోంది. మావోయిస్టునేత నామాల జయమ్మ అలియాస్ అరుణపై ఆరా తీయడంతో కేరళ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జయమ్మ మృతి చెందిందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
మావోయిస్టు నేత జయమ్మ వివరాలపై ఆరా
ఆమె మృతిపై అనుమానాలు...?
నంద్యాల క్రైమ్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో శుక్రవారం జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నిర్వహించిన విచారణ కలకలం రేపుతోంది. మావోయిస్టునేత నామాల జయమ్మ అలియాస్ అరుణపై ఆరా తీయడంతో కేరళ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జయమ్మ మృతి చెందిందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గడివేముల మండలం, బండి ఆత్మకూరు మండలం పరమటూరు గ్రామాల్లో మావోయిస్టు నేత నామాల జయమ్మ అలియాస్ అరుణకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. ఆమె తల్లిదండ్రులు, బంధువులను ప్రశ్నించడంతో పాటు స్థానిక వీఆర్‌ఓ వద్ద నుంచి రికార్డులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. గడివేముల మండలానికి చెందిన జయమ్మకు బండి ఆత్మకూరు మండలం పరమటూరుకు చెందిన నామాల భాస్కర్‌తో వివాహమైంది. అనంతరం భార్యభర్తలు నక్సలైట్ సిద్ధాంతాలకు ఆకర్షితులై నల్లమల అడవుల్లో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో భాస్కర్ పోలీసులకు లొంగిపోగా జయమ్మ మాత్రం మావోయిస్టు దళాలతోనే కొనసాగింది. నల్లమల ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు బలహీనపడిన తర్వాత జయమ్మ ఆంధ్ర - ఒడిశా సరిహద్దు(ఏఓబి) ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. ఎనిమిదేళ్ల క్రితం భాస్కర్ అనారోగ్యంతో మరణించగా, రెండేళ్ల క్రితం కేరళ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జయమ్మ మృతి చెందిన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సమయంలో కేరళ ప్రభుత్వం, మావోయిస్టు పార్టీ కూడా ఆమె మృతిని ధృవీకరించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు సమాచారం అందించినప్పటికీ వారు స్పందించలేదని తెలుస్తోంది.
అయితే ఆమె మరణించనట్లు ప్రచారం జరిగిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్‌ఐఏ అధికారులు గడివేముల, పరమటూరు గ్రామాలకు వచ్చి విచారణ చేపట్టడం జిల్లాలో చర్చనీయాంశమైంది. జయమ్మకు సంబంధించిన పాత వివరాలు, కుటుంబ నేపథ్యం, బంధువుల సమాచారం, అధికారిక రికార్డులను సేకరించడంతో ఆమె విషయంలో ఏదైనా కొత్త కోణంలో దర్యాప్తు జరుగుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌ఐఏ అధికారుల ఆకస్మిక విచారణతో స్థానికంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. జయమ్మ నిజంగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిందా? లేక మరేదైనా కోణంలో విచారణ కొనసాగుతోందా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.