రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:29 PM
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 2 నుండి 9వ తేది వరకు 141 గ్రామాల్లో నిర్వహించనున్న రెవెన్యూ గ్రామ సభలలో రైతులకు పాత భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కూడిన 94,090 కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు.
తడకనపల్లెలో పంపిణీ చేసిన కలెక్టర్ ఏ.సిరి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 2 నుండి 9వ తేది వరకు 141 గ్రామాల్లో నిర్వహించనున్న రెవెన్యూ గ్రామ సభలలో రైతులకు పాత భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కూడిన 94,090 కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలను కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో పంపిణీ చేసిన భూహక్కు పత్రాలను వెనక్కి ఇచ్చి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోవాలని కలెక్టర్ ప్రజలకు తెలిపారు. కొత్త పట్టాదారు పాసుపుస్తకాల్లో యజమాని పేరు, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, సామాజిక హోదా, ఫొటో తదితర వివరాలు అన్నీ ఉంటాయన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. నూతన పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా రైతులకు భూహక్కులు లభించడంతో పాటు, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. జిల్లాలో 3,216 పాసు పుస్తకాలను, తడకనపల్లెలో-1138 కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. అనంతరం కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి రైతులకు రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను అందజేశారు. అదే విధంగా పొదుపు గ్రూప్ సభ్యులకు స్త్రీనిధి కింద మంజూరైన రుణపత్రాలను పొదుపు గ్రూపు సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సందీ్‌పకుమార్, తహసీల్దారు కె. ఆంజనేయులు, సర్పంచ్ సహరాభి, కల్లూరు శాంతి మహిళా మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎస్. జుబేదాబీ, డైరెక్టర్ రామగిడ్డయ్య, ఉలిందకొండ, కల్లూరు, నన్నూరు సింగిల్ విండో చైర్మెన్లు ఈవీ. రమణ, డి. శేఖర్, నాగేశ్వరరెడ్డి, మాదేశ్, సుల్తాన్‌బాషా, సలాం తదితరులు పాల్గొన్నారు.