టీబీ జలాశయానికి కొత్త గేట్లు
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:14 AM
ఏపీ, కర్ణాటక రాష్ట్రాల రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయం. ఏ ప్రాజెక్టుకైనా గేట్లు అత్యంత ముఖ్యం. 70 ఏళ్లకు పైగా పని చేసిన క్రస్ట్‌గేట్లను తొలగించి .. వాటి స్థానంలో నూతన గేట్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు
ఇప్పటికే పది గేట్లు.. వివిధ దశల్లో మరో నాలుగు
ఏపీ బడ్జెట్-2026-27లో రూ.285 కోట్ల కేటాయింపు
ఏపీ, కర్ణాటక రాష్ట్రాల రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయం. ఏ ప్రాజెక్టుకైనా గేట్లు అత్యంత ముఖ్యం. 70 ఏళ్లకు పైగా పని చేసిన క్రస్ట్‌గేట్లను తొలగించి .. వాటి స్థానంలో నూతన గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. మే ఆఖరు నాటికి 33 క్రస్ట్ గేట్ల ఏర్పాటు పూర్తి చేసేందుకు టీబీపీ బోర్డు ఇంజనీర్లు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పది గేట్లు సిద్ధం చేశారు. మరో నాలుగు వివిధ దశల్లో ఉన్నాయి. మన ప్రాజెక్టు.. మన భద్రత లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏపీ బడ్జెట్-2026-27 బడ్జెట్‌లో రూ. 285 కోట్లు కేటాయించింది. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ జిల్లాల కరువు పల్లెసీమలకు సాగు, తాగు జలాలు అందించి అన్నదాతల కళ్లలో ఆనందం నింపే జలాశయం తుంగభద్ర. ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు ఇది. తుంగభద్ర జలాశయం నుంచి టీబీపీ ఎల్లెల్సీ కాలువ ద్వారా జిల్లాలో ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో 1.51 లక్షల ఎకరాలకు సాగునీరు, 194 గ్రామాలు సహా ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్ పట్టణాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఎల్లెల్సీ కాలువకు 24 టీఎంసీలు, కేసీ కాలువకు 10 టీఎంసీలు, ఉమ్మడి అనంతపురం జిల్లాకు 31.50 టీఎంసీలు నిఖర జలాలు వాటా ఉంది. 1953లో రైతుల సేవలోకి వచ్చిన టీబీపీ డ్యాంకు వరద పొటెత్తితే, ప్రాజెక్టు భద్రతలో భాగంగా వచ్చిన వరద వచ్చినట్లుగా దిగువకు వదిలేసేందుకు 6.50 లక్షల క్యూసెక్కులకు పైగా డిచ్చార్జ్ సామర్థ్యంతో 33 క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశారు. వీటి జీవిత కాలం 45 ఏళ్లేనని ప్రాజెక్టుల గేట్లు నిపుణులు, ఏపీ ప్రభుత్వం సలహాదారుడు కన్నయ్యనాయుడు పేర్కొన్నారు. 2024 ఆగస్టులో డ్యాం 19వ గేటు చైన్‌లింక్ తెగిపోయి కొట్టుకుపోవడంతో డ్యాం, గేట్ల భద్రతపై పలు పశ్నలు తెలెత్తాయి. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ), సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ కమిటీ సిఫార్సుల మేరకు కేఎస్‌ఎన్‌డీటీ సర్వీసెస్ సంస్థ ద్వారా గేట్లు సామర్థ్యం నిర్ధారణ, రేడియోగ్రఫీ, ఎంపీటీ, అలా్ట్ర సోనిక్, డీపీటీ వంటి పరీక్షలు చేయించారు. రూ.44 కోట్లతో పాత గేట్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో 33 కొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణనాయక్, బోర్డు ఇంజనీర్ల పర్యవేక్షణలో గుజరాత్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ సంస్థ అహోరాత్రులు శ్రమిస్తున్నారు.
గేట్ల ఫ్యాబ్రికేషన్ 32 గేట్లు గడువులోగా పాత గేట్లు తొలగించి, కొత్త గేట్లు ఏర్పాటుకు పక్కా ప్రణాళిక రూపొందిం చారు. ఇప్పటికే 23 గేట్లు తయారీ (ఫ్యాబ్రికేషన్) పూర్తి చేయగా, మరో రెండు గేట్లు వివిధ దశల్లో ఉన్నాయి.
తొలి ప్రయత్నం విజయవంతం: గత ఏడాదే క్రస్ట్‌గేట్ల గేట్ల తయారీ (ఫ్యాబ్రికేషన్) పనులు డ్యాం సమీపంలో, గదగ్ దగ్గర రెండు ప్రాంతాల్లో చేపట్టారు. ఫ్యాబ్రికేషన్ చేసిన గేట్ల విడి భాగాలను డ్యాం దగ్గరకు చేర్చారు. పూర్తిగా తుప్పుపట్టి దెబ్బతిన్న 18వ నంబరు గేటు మొదట ఏర్పాటు చేయాలని గత డిసెంబరు 6న ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించారు. జనవరి 12న ఆ గేటు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి విజయవంతంగా ట్రైల్ రన్ పూర్తి చేశారు.
పాత గేట్లు తొలగింపు: డ్యాం 33 క్రస్ట్ గేట్లకు గాను ఇప్పటికే 20 పాత గేట్లు పూర్తిగా తొలగించారు. గేట్ నంబరు. 5,29,31 పాత గేట్ల తొలగింపు పనులు పురోగతిలో ఉన్నాయి.
కొత్త గేట్లు ఏర్పాటు: గేట్ నంబరు.18 ఇప్పటికే పూర్తి చేసి ట్రైల్ రన్ విజయవంతం చేశారు. 01,04,17,19,20,27,28,32,33 గేట్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. గేటు నంబరు.03,11,24,26 గేట్ల ఏర్పాటు పనులు వివిధ దశల్లో ఉన్నాయి. తుంగభద్ర డ్యాం భద్రతపై సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. వైసీపీ హయాంలో వాటా కోసం ఆనాటి టీబీపీ బోర్డు ఇంజనీర్లు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రాలు కుమ్మక్కై బోర్డు నిబంధనలకు విరుద్ధంగా 2022 ఫిబ్రవరి 26న టీబీపీ ఎల్లెల్సీ 115.275 కి.మీ నుంచి 205.275 కి.మీ వరకు రూ.448 కోట్లతో ఆర్‌సీసీ లైనింగ్ పనులు చేపట్టారు. 2023 జనవరి 1న టీబీపీ జిల్లాలో ఎల్లెల్సీ 205.45 కి.మీ నుంచి 250 కి.మీ వరకు రూ.300 కోట్లు, అనంతపురం జిల్లాలో హెచ్చెల్సీ రూ.100 కోట్లు కలిపి రూ.400 కోట్లతో ఆర్‌సీసీ లైనింగ్ పనులు టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టారు. ఈ పనుల్లో అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులకు భారీ ఎత్తున వాటాలు అందాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా రూ.వందల కోట్లు వైసీపీ ప్రభుత్వం బకాయి పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.200 కోట్లు బకాయి బిల్లులు చెల్లించారు. 2024 ఆగస్టులో 19వ నంబరు గేటు కొట్టుకుపోతే, కర్ణాటక ప్రభుత్వం కంటే ముందే ఏపీ కూటమి ప్రభుత్వం స్పందించింది. ప్రాజెక్ట్స్ నిపుణుడు కన్నయ్యనాయుడును పంపించి స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు చేసి దాదాపు 78 టీఎంసీలు కడలిపాలు కాకుండా కాపాడారు. రాయలసీమ కరువు రైతుల కన్నీటి కష్టాలు తీర్చారు. నిపుణుల సూచన మేరకు డ్యాం 33 క్రస్ట్ గేట్ల స్థానంలో నూతన గేట్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గేట్ల ఏర్పాటు, ఎల్లెల్సీ, హెచ్చెల్సీ అధునికీకరణ పనులకు ఏపీ బడ్జెట్-2026-27 బడ్జెట్‌లో రూ.285 కోట్లు కేటాయింపులు చేశారు.
మే ఆఖరులోగా మొత్తం గేట్లు ఏర్పాటు చేస్తాం
- నారాయణ నాయక్, టీబీపీ బోర్డు ఎస్‌ఈ, హోస్పెట్:
వచ్చే ఖరీఫ్‌కు రైతులకు ఏమాత్రం సాగునీటి ఇబ్బంది లేకుండా మే ఆఖరులోగా టీబీపీ డ్యాం 33 క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 18వ నంబరు గేటు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశాం. మరో పది గేట్ల ఏర్పాటు పూర్తి చేయగా, నాలుగు పురోగతిలో ఉన్నాయి. 23 గేట్లు తయారీ (ఫ్యాబ్రికేషన్) పూర్తి చేయగా, రెండు గేట్లు తయారీలో ఉన్నాయి. నూతన గేట్లు ఏర్పాటులో భాగంగా 20 పాత గేట్లు పూర్తిగా తొలగించాం. పక్కా ప్రణాళికతో గడువులోగా పనులు పూర్తి చేస్తాం.