కొత్త ఉపాధి పథకం
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:30 AM
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పథకాన్ని కొత్తగా గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ వికసిత్ అజీవికా పోషణ్ పథకంగా మార్చిన విషయం తెలిసిందే.
పల్లెల ప్రగతికి శ్రీకారం
అవగాహన కోసం నేటి నుంచి గ్రామసభలు
డ్వామా పీడీ వెంకటరమణయ్య
కర్నూలు అగ్రికల్చర్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పథకాన్ని కొత్తగా గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ వికసిత్ అజీవికా పోషణ్ పథకంగా మార్చిన విషయం తెలిసిందే. ఈ పథకానికి అనేక మార్పులు, చేర్పులు చేస్తూ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఈ పథకాన్ని ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో గ్రామాల్లో అమలు చేసేందుకు ఏర్పాట్లు యుద్ధ ్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి గ్రామాల్లో పనులు చేస్తున్న రైతులు, కూలీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించేందు కోసం నేటి నుంచి జిల్లాలోని 973 గ్రామ పంచాయతీలో గ్రామసభలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. ఈ కొత్త పథకంపై గ్రామస్థాయిలో అన్ని స్థాయిల్లోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం నుంచి గ్రామసభలను నిర్వహిస్తున్నారు.
కొత్త పథకం అమలు ఇలా..
ఇప్పటిదాకా అమలైన పథకంలో కూలీలకు నూరు రోజులు మాత్రమే పని దినాలు ఉండేవి. కొత్తగా అమలులోకి తెచ్చిన పథకంలో 125 రోజులకు పనిదినాలను పెంచారు. పథకం నిర్వహణకు సంబంధించిన అధికార యంత్రాంగం జీతభత్యాలు, ఇతర ఖర్చులకు సంబంధించి గతంలో కేవలం 6 శాతం నిధులనే కేటాయించేవారు. ఆ మొత్తాన్ని 9 శాతానికి పెంచారు. గతంలొ పథకానికి సంబంధించి 90 శాతం కేంద్రం, పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేది. ఇకపై కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిష్పత్తితో భరించాల్సి ఉంటుంది. జల సంరక్షణ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, జీవనోపాధుల కల్పన, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అవసరమైన పనులనే చేపడుతారు. ఉపాధి పనులు చేయాలనుకునే వారికి 14 రోజుల్లో పని కల్పించకపోతే నిరుద్యోగభృతి (ఒకరోజు ఇచ్చే వేతనంలో సగం మొత్తం) వారి ఖాతాలకు జమ చేస్తారు. ఈ మొత్తాన్ని బాధ్యులైన సిబ్బంది నుంచి రికవరీ చేశారు. కూలీలకు వేతనాల చెల్లింపులో ఏమైనా ఆలస్యం చేస్తే ఖచ్చితంగా పరిహారాన్ని అందిస్తారు.
నేడు గ్రామసభలు
కేంద్రం కొత్తగా అమలులోకి తెచ్చిన చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సోమవారం గ్రామసభలను నిర్వహిస్తున్నాం. ఎంపీడీవోల ఆధ్వర్యంలో ఈ సభలు జరుగుతాయి. అందరూ ఈ సభలకు హాజరై అవగాహన పెంచుకోవాలి.
- వెంకటరమణయ్య, పీడీ, డ్వామా