ఎరువుల కొనుగోలుకు కొత్త యాప్
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:27 AM
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన యాప్ ద్వారా యూరియా, డీఏపీ ఎరువుల కొనుగోళ్ల కోసం వినియోగిస్తున్న రైతులు వివిధ కారణాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గందరగోళంలో అన్నదాతలు
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన యాప్ ద్వారా యూరియా, డీఏపీ ఎరువుల కొనుగోళ్ల కోసం వినియోగిస్తున్న రైతులు వివిధ కారణాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను అమలులోకి తెచ్చింది. యూరియా, డీఏపీతో పాటు ఇకపై కాంప్లెక్స్ ఎరువులు కావాలన్నా రైతులు కేంద్రం అమలులోకి తెచ్చిన యాప్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూరియా కావాలంటే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే వ్యవస్థ రావడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక నుంచి యూరియాతో పాటు మిగిలిన ఎరువులు సైతం యాప్‌లోనే బుక్ చేసుకునే కొత్త వ్యవస్థను కేంద్రం అమలులోకి తీసుకురానుంది. యూరియాతో పాటు డీఏపీ, పొటాష్, ఇతర కాంప్లెక్స్ ఎరువులు కూడా యాప్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో కర్షకులకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. రెండు నెలలుగా యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక ఇతర ఎరువుల కొనుగోళ్లకు అవస్థలు తప్పేలా కనిపించడం లేదు. నిరక్షరాస్యులు, సెల్‌ఫోన్ వాడకం తెలియని వారు యాప్‌లో యూరియాను బుక్ చేసుకోవాలో తెలియక అష్టకష్టాలు పడుతున్నారు. ఈ తరుణంలో మిగతా వాటిని కూడా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతుండటంపై రైతుల్లో ఆందోళన మొదలైంది. ఉమ్మడి జిల్లాలో యూరియాతో పాటు డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో దాదాపు లక్షన్నర మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అవసరమవుతున్నాయి. యూరియాను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి మరి కొద్ది రోజుల్లో రైతులు సిద్ధం కాక తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన యాప్‌తోనే యరియా కొనుగోలుకు కుస్తీలు పడుతున్న రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. యూరియా యాప్‌ను రద్దు చేస్తూ దాని స్థానంలో కొత్త యాప్ ఫ్రేమ్‌వర్క్, ఫర్టిలైజర్ సేల్ - ఎఫ్‌ఎ్‌ఫఎ్‌సను అమలులోకి తెచ్చింది. ఇక నుంచి ఏ రకమైన ఎరువులు పొందాలన్నా ఈ యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలి. ఎరువులు కావాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. లేకపోతే ఆధార్ ఆధారంగా యాప్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే అవసరమైన ఎరువులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించకపోతే ఎరువుల కొనుగోలు సాధ్యపడదు. ఉమ్మడి జిల్లాలో పరిమితికి మించి రైతులు యూరియా, డీఏపీతో పాటు నాణ్యత లేని ఎరువులను ఉపయోగిస్తుండటం వల్ల పొలాలు సారాన్ని కోల్పోతున్నాయి. అంతేకాకుండా దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సరికొత్త యాప్‌ను అమలులోకి తెచ్చిందని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.