నేడు నీట్
ABN , Publish Date - May 02 , 2026 | 10:40 PM
దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షకు సర్వం ఏర్పాట్లు సిద్ధం చేశారు.
కర్నూలు ఎడ్యుకేషన్, మే 2 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షకు సర్వం ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నీట్ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులను ఉదయం 11.30 గంటల నుంచి పరీక్ష కేంద్రా ల్లోనికి అనుమతి ఇస్తారు. మధ్యాహ్నం 1.30 గంట తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేటప్పుడు అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు రెండు పాస్ ఫొటోలు, వికలాంగుల అభ్యర్థులైతే ధృవీకరణ పత్రాన్ని తప్పకుండా తీసుకువెళ్లాలి. కలర్ వాటర్ బాటిల్‌ను అనుమతించరు. బంగారు ఆభరణాలు, చేతి గడియారాలు ధరించరాదు. కర్నూలు నగరంలో మొత్తం 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్ సిటీ కోఆర్డినేటర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ పాయల్ ప్రియదర్శిని, డా. సత్యబాబు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మాస్ కాపీయింగ్, చూచి రాతలకు ఆస్కారం లేకుండా ప్రతి గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ డా.ఏ. సిరి పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్ష హాలులో మంచి వాతావరణంతో వెలుతురు, గాలి ఉండాలని, శుభ్రమైన తాగునీరు అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. పనికిరాని వస్తువులు పరీక్ష కేంద్రంలో లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులందరూ బయోమెట్రిక్ అటెండెన్స్ వేయించు కుని మెయిన్ గేటు వద్ద తనిఖీలు చేయించుకుని పరీక్ష హాలులోకి చేరుకోవాలని సూచించారు. కర్నూలు నగరంలో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పరీక్ష నిర్వహణకు కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రతి నిమిషం కీలకమే
నీట్ ప్రవేశ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలి
పరీక్ష రాసే 3 గంటల సమయంలో బయోమెట్రిక్ కోసం అభ్యర్థులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని ఎన్‌టీఏ పరీక్షల డైరెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అభ్యర్థి పరీక్ష గదిలోకి ప్రవేశానికి ముందే తప్పనిసరిగా బయోమెట్రి ప్రక్రియ పూర్తి చేయాలి.
ఒకవేళ పరికరాలు పని చేయకపోయినా, సర్వర్ మొరాయించినా, ఇతర సాంకేతిక ఇబ్బందులు మొదలై బయోమెట్రి ప్రక్రియ పూర్తి కాకపోయినా అభ్యర్థిని పరీక్ష గదిలోకి అనుమతించాలి.
అభ్యర్థుల నుంచి హామీ పత్రం తీసుకోవాలి. ఈ హామీ పత్రం నమూనా కూడా పరీక్ష కేంద్రాల వద్ద ఉంచాలి.