నేడు నీట్ రీ ఎగ్జామినేషన్
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:59 PM
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం ని ర్వహించే నీట్ రీ-ఎగ్జామినేషన్‌కు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
నగరంలో 16 పరీక్ష కేంద్రాలు
హాజరయ్యే విద్యార్థులు 4,995 మంది
హెల్ప్ డెస్క్ నెంబర్ 08518-277305
కర్నూలు ఎడ్యుకేషన్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం ని ర్వహించే నీట్ రీ-ఎగ్జామినేషన్‌కు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గత మే నెల 3వ తేదీన నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో తిరిగి నీట్ రీ-ఎగ్జామినేషన్‌ను నిర్వహించనున్నారు. రెండోసారి పరీక్ష రాయాల్సి రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో మంచి స్కోరు సాధించిన విద్యార్థులు మళ్లీ సరిగ్గా రాస్తామో లేదోనన్న టెన్షన్‌తో ఉన్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులను ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఇస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతించరు. కర్నూలు నగరంలో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు మొత్తం 4,995 మంది నీట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండులో ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో చిన్న సంఘటన జరిగినా డయల్ 112కు, 100కి సమాచారం ఇవ్వాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశించారు. అలాగే కలెక్టరేట్‌లోని హెల్ప్ డెస్క్ నెంబర్ 08518-277305ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అలాగే నీట్ పరీక్షను వివిధ పరీక్ష కేంద్రాల్లో పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా దివ్యాంగులకు అదనంగా సమయం కేటాయించారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా.ఏ. సిరి సూచించారు. పరీక్ష హాలులో వెలుతురు, గాలి ఉండాలని, శుభ్రమైన తాగునీరు అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. కర్నూలు నగరంలో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పరీక్ష నిర్వహణకు కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక అవసరాల దృష్ట్యా అదనంగా 15 నిమిషాల సమయం కేటాయించారు. ఈ అంశంపై సంబంధిత అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
నీట్ అఽభ్యర్థులకు ఉచిత ప్రయాణం
హాల్ టికెట్ చూపిస్తే చాలు
ఆర్టీసీ ఆర్‌ఎం టి. శ్రీనివాసులు
కర్నూలు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ కేంద్రాల్లో జరిగే నీట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆ సంస్థ కర్నూలు ఆర్‌ఎం టి. శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎక్స్‌ప్రెస్, అలా్ట్ర పల్లెవెలుగు, పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్ చూపిస్తే చాలన్నారు. ఉదయం ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, పరీక్షలు ముగిన తరువాత పరీక్ష కేంద్రాల నుంచి ఇంటికి ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.