జాతీయ లోక్ అదాలత్ విజయవంతం
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:52 PM
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయా ధికారి జి.కబర్ధి తెలియజేశారు.
ప్రధాన న్యాయాధికారి కబర్ధి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 62,225 కేసుల పరిష్కారం
కర్నూలు లీగల్, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయా ధికారి జి.కబర్ధి తెలియజేశారు. నగరంలోని న్యాయ సేవా సదన్ భవన్‌లో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను ప్రధాన న్యాయాధికారి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గత కొన్ని వారాలుగా క్రమం తప్పకుండా జాతీయ ప్రీ లోక్ అదాలత్‌ను నిర్వహించి జాతీయ లోక్ అదాలత్‌కు సన్నాహాలు చేసినట్లు చెప్పారు. దీంతో ఈ జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమైనట్లు ఆయన తెలిపారు. కక్షిదా రులు ఈ జాతీయ లోక్‌అదాలత్‌ను ఉపయోగించుకుని ఎటు వంటి ఖర్చులు లేకుండా సత్వర న్యాయం పొందడానికి వీలు కలిగిందని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ విజయ వంతం కావడానికి పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, బ్యాంకు తదితర శాఖల అధికారులు, న్యాయవాదులు విశేషంగా కృషి చేశారని, వారి కృషి ఫలితంగా నేడు జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని తెలిపారు. కక్షిదారులకు ఉచిత న్యాయ సహాయాన్ని సత్వరంగా అందించడానికి జిల్లా వ్యాప్తంగా 31 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి పి.వాసు, సీబీఐ కోర్టు న్యాయాధికారి శోభారాణి, మహిళా కోర్టు న్యాయాధికారి లక్ష్మీరాజ్యం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, జూనియర్ సివిల్ న్యాయాధికారులు సరోజనమ్మ, అనూష, అనిల్, బార్ అసోసి యేషన్ అధ్యక్షుడు బి.చంద్రుడు, పలువురు న్యాయవా దులు, న్యాయ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 62,225 కేసుల పరిష్కారం
స్థానిక న్యాయ సేవాసదన్ భవన్‌లో శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో 62,225 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. ఈ కేసులలో 200 కేసులు మోటారు వాహనాల ప్రమాదం సంబంధించిన కేసులు ఉన్నాయని, నష్టపోయిన వారికి రూ.15,11,43,507లను నష్టపరిహారంగా చెల్లించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపునకు గురైన 96 మంది బాధితులకు నష్టపరిహారంగా రూ.42 లక్షలను ఇప్పించినట్లు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో 548 సివిల్ కేసులు, 61,292 క్రిమినల్ కేసులు, 289 బ్యాంకు కేసులు పరిష్కారమైనట్లు ఆయన తెలిపారు.