Share News

నారసింహుడి గరుడోత్సవం

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:10 PM

నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం గరుడోత్సవంతో ముగిశాయి.

నారసింహుడి గరుడోత్సవం
ఎగువ అహోబిలం: గరుడోత్సవంలో పాల్గొన్న భక్తులు

వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ముగిసిన బ్రహ్మోత్సవాలు

ఆళ్లగడ్డ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం గరుడోత్సవంతో ముగిశాయి. పీఠాధిపతి శ్రీవణ్‌ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా సుదర్శన చక్రత్తాళ్వార్‌కు చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం ద్వాదశారాధనం 12 రకాల సపర్యలతో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులకు పుష్పయాగం నిర్వహించారు. తదనంతరం గరుడోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని పల్లకిలో ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ వీఽధులు కిక్కిరిసాయి. ఆలయ ఆవరణలో పలు అన్నదాన కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. అలాగే ఎగువ అహోబిలం లో మంగళవారం రాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి గరుడోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నతీష నర్తన కూచిపూడి కళాఛత్ర వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో అలరించాయి. అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌ బాబు ఆద్వర్యంలో సీఐ బివీ రమణ, ఎస్‌ఐలు పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Mar 04 , 2026 | 11:10 PM