విమానాశ్రయంలా నంద్యాల రైల్వే స్టేషన్
ABN , Publish Date - May 12 , 2026 | 11:14 PM
నంద్యాల రైల్వేస్టేషన్‌ను విమానాశ్రయంలా అభివృద్ధి చేశామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
ఎంపీ బైరెడ్డి శబరి
నంద్యాల నూనెపల్లి, మే 12 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల రైల్వేస్టేషన్‌ను విమానాశ్రయంలా అభివృద్ధి చేశామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. మంగళవారం ఆమె నంద్యాల రైల్వేస్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డీఆర్‌ఎం సుధేష్ణసేన్‌తో కలిసి గుంతకల్లు వయా నంద్యాల మీదుగా మార్కాపురం వరకు వెళ్లే నూతన ప్యాసిం జర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు తాము నంద్యాల నుంచి గుంతకల్లు వైపు వెళ్లేందుకు పగటిపూట ఒక్క రైలు కూడా లేదని ఎలాగైనా పగటి పూట ఫ్యాసింజర్ రైలు నడిచేలా చూడాలని వినతిపత్రాలు ఇచ్చారన్నారు. ఈ సమస్యను తాను పార్లమెంట్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లగా ఈ సమస్యకు పరిష్కారం చూపారన్నారు. అలాగే నంద్యాల మీదుగా అజ్మీర్, శబరిమల, కడప ఇస్తేమాలకు ప్రత్యేక రైళ్లు వేయించామని, ప్రయాణికుల కోరిక మేరకు నంద్యాల మీదుగా మరిన్ని రెగ్యులర్ రైళ్లు నడిసేలా చూస్తామ న్నారు. నంద్యాల, బనగానపల్లి, కోవెలకుంట్ల, బేతంచెర్ల, డోన్ రైల్వే స్టేషన్లలో ఇంకా అనేక సమస్యలున్నాయని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. నంద్యాల, మార్కాపురం జిల్లాల రైల్వే డివిజనల్, జోనల్ జడ్ ఆర్ సీసీ సభ్యులు నారాయణరెడ్డి, వెంకటరంగయ్య, జిన్ను ప్రసాద్‌రెడ్డి, నాగేశ్వరావు, అమీర్‌బాషా, జుబేర్‌బాషాలను డీఆర్‌ఎం, ఎంపీ సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం డా. ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.