Share News

నంద్యాలకు రూ.వంద కోట్ల బడ్జెట్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:20 PM

నంద్యాల మున్సిపాలిటీకి 2026-2027 ఆర్థిక సంవత్సరానికి మున్సిపాలిటీ బడ్జెట్‌ రూ.102.5 కోట్లతో ప్రవెశపెట్టి ఆమోదం తెలిపారు.

నంద్యాలకు రూ.వంద కోట్ల బడ్జెట్‌
బడ్జెట్‌ను చదువుతున్న మున్సిపల్‌ అధికారి, చైర్‌ పర్సన్‌

మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం

మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం

నంద్యాల టౌన్‌, పిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): నంద్యాల మున్సిపాలిటీకి 2026-2027 ఆర్థిక సంవత్సరానికి మున్సిపాలిటీ బడ్జెట్‌ రూ.102.5 కోట్లతో ప్రవెశపెట్టి ఆమోదం తెలిపారు. మంగళవారం నంద్యాల మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశ హాల్‌లోమున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాబున్నీసా అధ్యక్షతన బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. ముందుగా రాబడి ఆదాయం, రాబడి వ్యయం, మూలధన ఆదాయం, మూలధన వ్యయం వంటి వాటిని చదవి వినిపించారు. కొందరు కౌన్సిల్‌ సభ్యులు రూ.100 కోట్ల బడ్జెట్‌ ఎలా తెస్తారని అడిగారు. ఇందుకు స్పందించి మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న మాట్లాడుతూ మున్సిపాలిటీ ఆదాయం వనరుల ద్వారా సుమారుగా రూ.64కోట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు సుమారుగా రూ.30కోట్లు వస్తాయని తెలిపారు. ఇవే కాక ప్రత్యేక నిధుల కింద నంద్యాల మున్సిపాలిటీకి రూ.100కోట్లు డ్రైనేజీ వ్యవస్థకు, పారిశుధ్యానికి రానున్నాయని మంత్రి ఫరూక్‌ తెలిపినట్లు కమిషనర్‌ పేర్కొన్నారు. పట్టణాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఈబడ్జెట్‌కు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. పట్టణంలో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యమి చ్చారు. పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, వీధిదీపాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ బడ్జెట్‌ను రూ పొందించినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది అయిన బడ్జెట్‌ కంటే 40శాతం అధికంగా అంచనా రూపొందించారు. కార్యక్రమంలో ఏంఈ గురప్ప యాదవ్‌, ఎస్‌ఎస్‌ మురళి, ఆర్‌వో వెంకటరెడ్డి, డీఈ నాగభూషణంరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:20 PM