Share News

నమో నారసింహా..

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:35 PM

నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

నమో నారసింహా..
దిగువ అహోబిలం రథోత్సవంలో పాల్గొన్న ప్రజలు

నేత్రపర్వంగా అహోబిల నృసింహుడి రఽథోత్సవం

భక్తులతో పోటెత్తిన క్షేత్రం

వైభవంగా సాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఆళ్లగడ్డ, మార్చి 3(ఆంధ్రజ్యోతి): నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దిగువ అహోబిలంలో స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన అహోబిల లక్ష్మీనరసింహస్వామి రథంపై విహరిస్తుండగా శ్రీవారి వైభవాన్ని తిలకించిన భక్తజనం పులకించిపోయారు. రథం ముందుకు కదులుతుండగా వేలాదిమంది భక్తులు రథం ముందు, వెనుక గోవిందనామ స్మరణ చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ముందుగా వేదపండితులు రథారోహణం నిర్వహించారు. రథం వద్ద పుణ్యాహవచనం, బలిహరణ, కుంభహారతి తర్వాత ఉత్సవమూర్తులను బ్రహ్మరథంపై అధిష్టింపజేశారు. మఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్‌ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో రథోత్సవం కొనసాగింది. భక్తుల గోవింద సామస్మరణతో నల్లమల పులకించిపోయింది. అలాగే ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ద్వాదశ ఆరాధనం పుష్పయాగోత్సవం నిర్వహించారు. అనంతరం గరుడోత్సవం నిర్వహించారు. ఉత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో అహోబిల క్షేత్రం రద్దీగా కనిపించింది. ఆలయ సీఏఓ రామానుజన్‌ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. నంద్యాల ఏఎస్పీ యుగంధర్‌ బాబు ఆధ్వర్యంలో సీఐ బీవీ రమణ, ఎస్‌ఐలు, ప్రత్యేక పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు.

Updated Date - Mar 03 , 2026 | 11:35 PM