Share News

ఎంవీ స్కీం సాకారం

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:26 AM

మల్టీ విలేజ్‌ స్కీం(ఎంవీఎస్‌) ద్వారా గ్రామాలకు తాగునీరు అందిం చే పథకం పనులు వేగవంతమయ్యాయి.

ఎంవీ స్కీం సాకారం
శరవేగంగా జరుగుతున్న ఓహెచ్‌బీఆర్‌ ట్యాంకు పనులు

రూ. 4.60 కోట్ల నిధులు విడుదల

14 గ్రామాలకు తాగునీటి సౌకర్యం

డిసెంబర్‌ 21న నీరు సరఫరా

గోనెగండ్ల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మల్టీ విలేజ్‌ స్కీం(ఎంవీఎస్‌) ద్వారా గ్రామాలకు తాగునీరు అందిం చే పథకం పనులు వేగవంతమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులకు కూటమి ప్రభుత్వం రూ. 4.60 కోట్లను విడుదల చేసింది. దీని వల్ల గోనెగండ్ల మండల ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రసుత్తం ఈ స్కీంను జలజీవన్‌ మిషన్‌ పనులకు అనుసంధానం చేశారు. 2017న అప్పటి టీడీపీ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల ముందు ఎంవీఎస్‌ కింద మండలంలోని 11 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ. 13.50 కోట్ల నిధులతో పనులు ప్రారంభించింది. ఆ ఎన్నికల్లో అఽధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపేసింది. 2025 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా నే కొంత నిధులను విడుదల చేయడంతో పనులు శరవేగంగా జరిగాయి. అయితే గత నాలుగు మాసాలుగా నిధులు నిలిచిపోవడంతో పనులు ఆగిపోయాయి. 10 రోజుల క్రితం రూ. 4.60 కోట్లు కాంట్రాక్టర్‌కు నిధులు విడుదల కావడంతో గత వారం రోజులుగా పనులు నడుస్తున్నాయి. ఓహెచ్‌బీఆర్‌, ఇన్‌టెక్‌వెల్‌, ఓహెచ్‌ఆర్‌, 5ఎంఎల్‌డీ ఫిలర్టర్‌ పనులు, 44 కిలోమీటర్ల పైప్‌ లైన్‌ పనుల శరవేగంగా జరుగుతున్నాయి.

నిధులను పెంచిన ప్రభుత్వం

మండల పరిఽధిలోని 11 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం మల్టీ విలేజస్‌ స్కీం కింద చేపట్టిన పనులకు అప్పటి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి 2017 ఏప్రిల్‌ నెలలో భూమి పూజ చేసి ప్రాంరంభించారు. పథకాన్ని ప్రారంభించిన అనంతరం సర్వే పనులు, నిధుల విడుదల, టెండర్‌ పూర్తి కావడం తదితర పనులు పూర్తి అయి 2017 డిసెంబర్‌ నాటి నుంచి పథకానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఈ పథకం కింద హెచ్‌ కైరవాడి, గాజులదిన్నె, పుట్టపాశం, పెద్దనేలటూరు, ఎర్రబాడు, కులుమాల గ్రామాల్లో ఓహెచ్‌ఆర్‌ ట్యాంకుల నిర్మాణ పనులు కూడా చేపట్టారు. ఆ తర్వాత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. కూటమి ప్రభుత్వం రూ. 13.50 కోట్ల నుంచి రూ. 19.50 కోట్లు నిధులు కేటాయించడమేగాక 11 గ్రామాలకు అదనంగా మరో 3 గ్రామాలను చేర్చి 14 గ్రామాలకు నీరు అందించాలని నిర్ణయించింది.

డిసెంబరు 21 నాటికి:

2017లో టీడీపీ హయంలో విడుదల అయిన రూ. 13.50 కోట్ల నిధుల నుంచి ఆరుగ్రామాలలో ఆరు ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులు నిర్మించారు. ఇప్పుడు హెడ్‌ వర్కపనులు, ఓహెచ్‌బీఆర్‌ పనులు ఇన్‌టెక్‌వెట్‌, 5 ఎంఎల్‌డీ ఫిల్టర్‌, ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఫిల్టర్‌ పనులు పూర్తి కావస్తున్నాయి. 44 కిలోమీటర్ల పైప్‌లైన్‌ పనుల పూర్తి అయ్యాయి. హెచ్‌కైరవాడి, కులుమాల, ఎర్రబాడు, గాజులదిన్నె, పుట్టపాశం గ్రామాల ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులు పూర్తి అయ్యాయి. ఈ నెల డిసెంబరు నెల 21 నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలుపుతున్నారు

జీడీపీ దగ్గర స్థలం కేటాయింపు

గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో ఎంవీ స్కీంకు అప్పటి జనవనరుల శాఖ 75 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. ఈ ప్రదేశంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు ఓహెచ్‌ఆర్‌ ట్యాంకు, బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌, ర్యాపిడ్‌ శ్యాండ్‌ ఫిల్టర్స్‌ను నిర్మించి గాజులదిన్నె ప్రాజెక్టులోని నీటిని బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌లో నిలువచేసి గ్రామాలకు సరఫరా చేయాలన్నది పథకం లక్ష్యం. అలాగే వాచ్‌మెన్‌ గదులను కూడా నిర్మిచారు.

ఇది కూటమి ప్రభుత్వ ఘనత

ఎంవీ స్కీం పనులు ముగింపునకు వచ్చాయి. ఇది కూటమి ప్రభుత్వం ఘనత. గోనెగండ్ల మండలంలోని 11 గ్రామాలకు, ఎమ్మిగనూరు మండలంలోని 3 గ్రామాలకు తాగునీటి సమస్య తీరనుంది.

రామకృష్ణ, రాష్ట్ర కురువ కార్పొరేషన్‌ స్టేట్‌ డైరెక్టర్‌

తాగునీరు అందిస్తాం

ఎంవీ స్కీం కింద ప్రారంభమైన పనులు దాదాపు 85 శాతం పూర్తి అయ్యాయి. డిసెంబర్‌ 21 నాటికి పనులు పూర్తి చేసి 14 గ్రామాలకు తాగునీరు అందిస్తాము.

-శ్రీనివాసరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ గోనెగండ్ల

Updated Date - Sep 28 , 2026 | 12:26 AM