సంగీతం మనోరంజకం
ABN , Publish Date - May 02 , 2026 | 11:38 PM
మంచి సాహిత్యంతో కూడిన సంగీతం మనసును ఆహ్లాదపరిచే మనోరంజకమని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు.
డీఈవో సుధాకర్
కర్నూలు కల్చరల్, మే 2 (ఆంధ్రజ్యోతి): మంచి సాహిత్యంతో కూడిన సంగీతం మనసును ఆహ్లాదపరిచే మనోరంజకమని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. శనివారం రాత్రి టీజీవీ కళా క్షేత్రంలో జాఫర్‌బాషా ఆధ్వర్యంలో సంగీత విభావరి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఈవో సుధాకర్ మాట్లాడుతూ సంగీతానికి పరవశించని ప్రాణి అంటూ ప్రపంచంలో ఏదీ లేదని చెప్పారు. ఇలాంటి కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్న టీజీవీ కళాక్షేత్రం సేవలు అభినందనీయమన్నారు. అనంతరం డీఈఓ సుధాకర్ స్వయంగా పాడిన పాటలు అలరించారు. గాయకులు వీరలక్ష్మి, శ్రీనివాసరావు, జాఫర్‌బాషా, ఉస్మానబాషా, మహమ్మద్ మియాలను డీఈఓతో పాటు కళాక్షేత్రం అధ్యక్షులు కళారత్న పత్తి ఓబులయ్య ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాక్షేత్రం కార్యదర్శి యాగంటీశ్వరప్ప, డిప్యూటీ డైరెక్టర్ శివ రంగప్ప, మనోహర్, పార్వతి, రిటైర్డ్ ఎంఈఓ పి.రాజారత్నం, హెచఎం వాల్మీకి రాముడు, సంగా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
‘జాతీయ స్థాయి నాటక పోటీల్లో సత్తా చాటాలి’
కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి చెందిన కళాకారులు జాతీయస్థాయి నాటక పోటీల్లో సత్తా చాటాలని కళారత్న పత్తి ఓబులయ్య పిలుపునిచ్చారు. శనివారం కళాక్షేత్రంలో శ్రీకృష్ణ కమలపాలిక నాటక బృందం సభ్యులను ఆయన అభినందించారు. ముందుగా నటరాజస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం ఓబులయ్య మాట్లాడుతూ తిరుపతిలో జరిగే గరుడ నాటకోత్సవాలకు శ్రీకృష్ణ కమలపాలిక పద్యనాటకం ఎంపికైందన్నారు. ఈ నాటకంలో కళాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి జిల్లాకు పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు.