జిల్లా ఏర్పాటు చేసే దాకా ఉద్యమం
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:29 AM
జిల్లా ఏర్పాటు చేసేదాకా ఉద్యమం ఆగదని ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు అన్నారు.
ఆదోని అగ్రికల్చర్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఏర్పాటు చేసేదాకా ఉద్యమం ఆగదని ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు అన్నారు. వారు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 50వ రోజుకు చేరుకున్నాయి. దీంతో ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో మహా పాదయాత్రకు ఐదు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు కదలి వచ్చారు. భీమాస్ కూడలిలో దీక్షా శిబిరం నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన స్మారక స్థూపం వరకు పాదయాత్రగా కదిలివచ్చారు. ఎనిమిది కిలోమీటర్లు మేర వివిధ వర్గాల ప్రజా సంఘాలు, మహిళలు, విద్యార్థి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, అగ్రిఇన్పుట్స్ ఎంప్లాయిస్, బైక్ మెకానిక్స్, టైలర్లు, గంగపుత్ర సంఘం, సీపీఐ నాయకులు ఆదోని జిల్లాతోనే అభివృద్ధి సాధ్యం అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్ర చేశారు. జేఏసీ నాయకులు రఘురామయ్య, లలిత జితేంద్ర, అశోకనందరెడ్డి, వీరేశ్, కృష్ణమూర్తి గౌడ్, నూర్ అహ్మద్, వాల్మీకి సాయిప్రసాద్, కోదండ, దస్తగిరి, భూపేశ్ మాట్లాడుతూ ఆదోనిని జిల్లాగా ప్రకటించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. జిల్లాల పునర్విభజనలో కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థంతో ఆదోని జిల్లా కాకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. దీక్షలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆంజనేయ బండారి హనుమంతు, జగన్ సుధాకర్ కూర్చున్నారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు తిరుమలేశ్, ఉదయ్, రమేష్ బాబు, అయ్యాలప్ప, వెంటనేష్ పాల్గొన్నారు.