కుమారుడికి తల్లి కిడ్నీ దానం
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:07 AM
కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న 23 ఏళ్ల కుమారుడికి 65 ఏళ్ల తల్లి కిడ్నీదానం చేసి అమ్మ ప్రేమను చాటిచెప్పింది. కర్నూలు మెడికవర్ హాస్పిటల్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. రోగి కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు.
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న 23 ఏళ్ల కుమారుడికి 65 ఏళ్ల తల్లి కిడ్నీదానం చేసి అమ్మ ప్రేమను చాటిచెప్పింది. కర్నూలు మెడికవర్ హాస్పిటల్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. రోగి కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు. వివరాలు ఇలా... కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా ఉండ్రాల్‌దొడ్డికి చెందిన మంజునాథ్ నాయక్ అనే యువకుడు రెండేళ్ల నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ 8 నెలలుగా డయాలసిస్‌పై ఉన్నాడు. కిడ్నీ మార్పిడి కోసం రోగి హైదరాబాదులోని కార్పొరేట్ హాస్పిటల్స్‌ను సంప్రదించగా వైద్యులు ముందుకు రాలేదు. దీంతో రోగి ఈ నెల ఒకటో తేదీన కర్నూలు మెడికవర్ హాస్పిటల్‌కు వచ్చారు. కన్సల్టెంట్ యురాలజిస్టు డాక్టర్ ఎస్.అబ్దుల్ సమద్ పరీక్ష నిర్వహించగా.. రోగికి కిడ్నీ మార్పిడి చేయడానికి సిద్ధమయ్యారు. తల్లి కిడ్నీలో మూడు ధమనులు ఉండటం వల్ల ఆపరేషన్ సాంకేతికంగా అత్యంతక్లిష్టంగా మారినప్పటికీ హాస్పిటల్ యురాలజిస్టు డా.అబ్దుల్ సమద్, నెఫ్రాలజిస్టు డాక్టర్ సిద్ధార్థ్ హెరూర్ ఈ నెల 5వ తేదీన విజయవం తంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను నిర్వహించారు. ఆపరేషన్‌లో అనస్థీషియా సేవలను బాల ప్రవీణ్ కుమార్, రేష్మా అందించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ కర్నూలు హెడ్ డాక్టర్ వై.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ తమ హాస్పిటల్‌లో ఇది 7వ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అన్నారు. తల్లి తన కుమారుడికి కిడ్నీ దానం చేయడం ద్వారా జన్మతో పాటు పునర్జన్మను ఇచ్చిందన్నారు.