ఎన్నికల ప్రవర్తనా నిబంధనలపై నిఘా
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:09 AM
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఏ.సిరి సూచించారు.
కలెక్టర్ ఏ.సిరి
కర్నూలు కలెక్టరేట్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఏ.సిరి సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. కుల, మత, ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని, వ్యక్తిగ అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల వాతావరణానికి భంగం కలిగించరాదని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు, లౌడ్స్పీకర్ల వినియోగానికి సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్స్పీకర్ల వినియోగం చేయరాదని తెలిపారు. ప్రభుత్వ భవనాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, జాతీయ రహదారులు తదితర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా పోస్టర్లు, హోర్డింగులు, ప్రచార సామగ్రి ఏర్పాటు చేయరాదని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ పోర్టల్)లో అందుబాటులో ఉన్న సదుపాయాల మేరకు ఆన్లైన్ నామినేషన్ల దాఖలు, ఓటరు స్లిప్పుల డౌన్లోడు, పోలింగ్ కేంద్రాల వివరాలను తెలుసుకోవచ్చన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సమస్యలు ఉంటే 1800 425 4299 నెంబర్కు పోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరుపున ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ అక్రమ ఏకగ్రీవాలపై ఆర్డీవో ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయపడుతామన్నారు. ఈ సమావేశంలో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా పరిషత్ సీఈవో సుధాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ పాల్గొన్నారు.