Share News

పైసా వసూల్‌

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:41 PM

వైద్య ఆరోగ్య శాఖలో ఓ అధికారి తీరు ‘అవినీతి అనకొండ’ను తలపిస్తోంది.

పైసా వసూల్‌

అవినీతికి కేరాఫ్‌గా వైద్య ఆరోగ్య శాఖ

విధుల్లో చేరినా.. పీజీలకు వెళ్లినా పైసలివ్వాల్సిందే

ఆ అధికారితో నలిగిపోతున్న ఉద్యోగులు

గత వైసీపీ హయాం నుంచి ఇక్కడే తిష్ఠ

రూ. కోట్లలో అక్రమ సంపాదన

వైద్య ఆరోగ్య శాఖలో ఓ అధికారి తీరు ‘అవినీతి అనకొండ’ను తలపిస్తోంది. ఆ శాఖలో ఏ పని ముందుకు సాగాలన్న ఆ అధికారికి పైసలివ్వాల్సిందే. లేదంటే ఫైల్‌ ముందుకు కదలదు. అధికారం అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. కొన్నింట్లో కలెక్టర్‌ను బురిడీ కొట్టించి మరీ అవినీతి దందా సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన గత వైసీపీ హయాం లో ఇక్కడికి వచ్చి ఏళ్ల తరబడి తిష్ఠ వేసి రూ.కోట్లు గడించారనే ప్రచారం ఆ శాఖ ఉద్యోగుల్లో నెలకొంది. ఆయన తీరుతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లంచాలకు కేరాఫ్‌గా మారిందనే అభిప్రాయం ఆ శాఖ ఉద్యోగుల్లో ఉంది. ఫిర్యాదుల రూపంలోనూ అధికార దర్పణం ప్రదర్శించి క్యాష్‌ చేసుకోవడం పలు విమర్శలకు తావి స్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో కొనసాగుతున్న కాసుల కక్కుర్తిపరుడిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం

నంద్యాల, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): వైద్యారోగ్య శాఖలో ఎలాంటి పనులు కావాలన్న ఆ అధికారికి పైసలివ్వాల్సిందే. లేదంటే ఫైల్‌ ముందుకు సాగదు. పారదర్శకత కోసం అమలు చేస్తున్న ఈ-ఆఫీస్‌ విధా నాన్ని ఆ శాఖలో ఆశించినస్థాయిలో అమలు చేయక పోగా నేటికీ ఎక్కువ శాతం పాత పంథాలోనే (మాన్యువల్‌గా) సేవలు కొనసాగిస్తూ తమదైన శైలిలో అక్రమ దందాకు సాగిస్తున్నారని సమాచారం. అ క్రమ డిప్యుటేషన్లు, ఇష్టారాజ్యంగా పీహెచ్‌సీ వైద్యులకు డీడీవో పవర్స్‌ అప్పగించి ఆయావర్గాల నుంచి నెలవారి మామూళ్లు సాగిస్తున్నారని సమాచారం.

ముందస్తు డీల్‌ ప్రకారం..

కొందరు వైద్యులు, సిబ్బంది సైతం విధులకు రాకపోయినా కూడా జీతాలు డ్రా చేయించి ముందస్తు డీల్‌ ప్రకారం సదరు అధికారి అమ్యామ్యాలు తీసుకుంటున్నారని తెలిసింది. వీటికితోడు విధులకు డుమ్మా కొట్టే వైద్యులతో కూడా నెలవారి మామూళ్లు పెట్టుకున్నారనే ప్రచారం ఆ శాఖలో లేకపోలేదు. ఈ కోవకు చెందిన వైద్యులు, సిబ్బందితో వారి జీతాల్లో సగం జీతం తీసుకుంటున్నారని తెలిసింది.

అక్రమ వసూళ్లకు బరితెగించి..

డీఎంహెచ్‌వోలో కొత్తగా ఉద్యోగంలో చేరే వారైనా.. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యుల్లో ఎవరైనా పీజీ సీట్‌ వచ్చి పీజీలకు(రిలీవ్‌) వెళ్లాలన్నా కూడా పైసలిస్తేనే వారి ఫైల్‌ కదిలేది అన్నట్టుగా ఆ అధికారి తీరు ఉందని బాధిత వర్గాల నుంచి తెలిసింది. ఎవరైనా పైసలు ఇవ్వకపోతే వారి పని జాప్యం చేసి తన దారికి తెచ్చుకొని మరీ అక్రమ వసూళ్లకు బరితెగించారని తెలిసింది. గతంలో ఉద్యోగాల నుంచి తొలగించడంతో కోర్టుకు వెళ్లి పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. వీరిలో కొందరు ఇటీవల ఉద్యోగాల్లో చేరారు. వీరి నుంచి సదరు అధికారి ముక్కుపిండి డబ్బులు వసులూ చేశారని తెలిసింది.

రూ.30 లక్షలు ఖర్చు పెట్టి..

గత వైసీపీ పాలనలో సుమారు రూ.30ల క్షలు ఖర్చు పెట్టి సదరు ఉన్నతాధికారి జిల్లా వైద్యఆరోగ్యశాఖకు వచ్చినట్లు తెలిసింది. వచ్చేనెలతో నాలుగేళ్లు కావస్తోందని సమా చారం. జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేయడంతో పాటు తన వ్యవహారం బయటపడకుండా తమదైన శైలిలో తెరవెనుక కథ నడుపుతూ నేటికీ కొనసాగుతున్నారని ఆ శాఖవర్గాల ద్వారా తెలిసింది. ప్రజాప్రతినిధులను, జిల్లా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడంలో ఆయన దిట్ట. కలెక్టర్‌ ఎదుట ఆ అధికారి నానా హంగామా చేసి ఆకర్షించే ప్రయ త్నాలు చేస్తుంటారని తెలిసింది.

అన్నింటా నిలువు దోపిడీ..

సదురు అధికారి అన్నింటా నిలువు దోపిడీ చేస్తున్నారని ఆ శాఖలోని ఉద్యోగులు వాపోతున్నారు. సాధారణ సెలవుల నుంచి ఎస్‌ఆర్‌లు, ప్రసూతి సెలవులు, డిప్యుటేషన్లు, డీడీవో బాఽధ్యతలు, పేస్‌ బయో మెట్రిక్‌ తదితర వ్యవహారాల పరంగా స్థాయిని బట్టి ఆయా ఉద్యోగులను నిలువు దోపిడీకి పాల్పడుతున్నారనే సమాచారం. దారుణం ఏమిటంటే.. ఆశాఖ ఉన్నతాధికారి కదా అని ఎవరైనా ఫిర్యాదు చేసినా.. లోపాలు చూపించినా అదే అదనుగా వారిని బెదిరించి మరీ దందా సాగిస్తున్నట్లు తెలిసింది.

నలిగిపోతూ మిన్నకుండిపోయారు

కలెక్టర్‌కు ఫిర్యాదు చేద్దామంటే.. కలెక్టర్‌ బాగా క్లోజ్‌ అని చెప్తారు కదా? అని బాధిత వర్గాలు నలిగిపోతూ మిన్నుకుండి పోతు న్నారు. కొన్నింటిలో కలెక్టర్‌ను బురిడీ కొట్టించి లబ్ధి పొందారనే ప్రచారం లేకపో లేదు. అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా రూ.కోట్లలో అక్రమార్జన సంపా దించి అవినీతి అనకొండగా మారిపోయారని ఆయా వర్గాల్లో చర్చ.

ఏడాదికి సుమారు 12నుంచి 20 మంది వైద్యులు వరకు పీజీలకు వెళ్తారు. ఈ నేపథ్యంలో నాలుగు దఫాలుగా వైద్యులు పీజీలకు వెళ్లారు. ఆయా వారి నుంచి విధుల్లో చేరినప్పడు.. రిలీవ్‌ చేసే సమయాల్లో, తదితర రూపాల్లో ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.60వేలకు పైగానే వసూల్‌ చేశారని తెలిసింది. కొందరు ఇవ్వకపోతే ఒత్తిడి చేసి మరీ ఇప్పించుకున్నారని సమాచారం. కొందరు ఫోన్‌పేలు కూడా చేశారని తెలిసింది.

గతేడాది అహోబిళం, నరసాపురం పీహెచ్‌సీలో రూ.1.60కోట్లు దుర్వినియోగ మైన ట్లు గుర్తించి అప్పట్లో నలుగురు వైద్యులు, ఒక యూడీసీని సస్పెండ్‌చేశారు. యూడీసీని బాధ్యుడిగాచేసి మిగిలిన నలుగురు తిరిగి ఇటీవల రీపోస్టింగ్‌ పొందారు. ఈవ్యవ హారంలో ఆఅధికారి రూ.లక్షల్లో అమ్యామ్యాలు తీసుకున్నారని తెలిసింది.

అహోబిళం పీహెచ్‌సీలో డీడీవోగా పనిచేస్తున్న స్వాతి ఇటీవల పీజీకి వెళ్లింది. డీడీవో బాధ్యతలను ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యుడికి అప్పగించలేదు. సదరు వైద్యురాలు హెచ్‌డీఎస్‌ నిధులకు చెందిన బిల్లులు ఫేక్‌ బిల్లులు పెట్టడంతో ట్రేజరీ అధికారులు రిజక్ట్‌ చేశారు. ఈనేపథ్యంలో సదరు బిల్లుకోసం ఆ వైద్యురాలి డీడీవో బాధ్యతను రద్దు చేయకుండా ఈఅధికారి అలాగే ఉంచారని సమాచారం. త్వరలో పీజీ నుంచి వచ్చి మరో బిల్లు పెట్టి హెచ్‌డీఎస్‌ నిధులను డ్రా చేసి సదరు వైద్యురాలితో పాటు సదరు అధికారి సైతం పంచుకోవాలని ప్యూహం రచించారని తెలిసింది.

ఇటీవల జిల్లాలోని నరసాపురం, ఎర్రమటం, టంగుటూరు, జూపాడుబంగ్లా పీహెచ్‌సీల వైద్యులకు హెచ్‌ఆర్‌ఏ కట్‌ చేసినట్లు షోకాజ్‌ నోటీసీలు జారీ చేశారు. ఆ నలుగురు వైద్యులు ఎలాంటి హెచ్‌ఆర్‌ఏ కటింగ్‌ లేకుండా యఽథావిధిగా జీతాలు పొందారు. ఇలా వివిధ రూపాల్లో నోటీసులు ఇవ్వడం.. వాటిని సాకుగా చూపి తమదైన శైలిలో సదరు అధికారి తాను వచ్చినప్పటి నుంచి నేటి వరకు వివిధ రూపాల్లో క్యాష్‌ చేసుకున్నారని తెలిసింది.

గత ఏడాదిలో చాపిరేవుల పీహెచ్‌సీలో ఉదయ సంధ్య అనే వైద్యురాలు ప్రసూతి సెలవులో వెళ్లింది. ఆతర్వాత ఆమె అదనపు సెలవుల పేరుతో ఇంటివద్ద నుంచే ఎఫ్‌ఆర్‌ ఎస్‌ వేసి సదరు అధికారి ప్రోత్సాహంతో జీతాలు పొందినట్లు తెలిసింది. ఎవరికీ అను మానం రాకుండా సదరు వైద్యురాలి స్థానంలో గడివేముల పీహెచ్‌సీలో పనిచేస్తున్నా వైద్యురాలను డిప్యుటేషన్‌పై వేశారు. ఈవ్యవహరాల్లో ఆ అధికారి భారీగానే ముడుపులు అందినట్లు సమచారం.

తిమ్మాపురం పీహెచ్‌సీపై స్పెషల్‌ ఆఫీసర్‌ ఇటీవల ఆకస్మిక తనిఖీచేసి కలెక్టర్‌కు నివేధిక అందజేశారు. ఇంతలోనే డీఎంహెచ్‌వో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సదరు వైద్యులు, సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడకుండా సదరు అధికారి ఆ ఇద్దరు వైద్యులు, సిబ్బంది నుంచి ముడుపులు తీసుకున్నారని తెలిసింది. .

జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా 53 పీహెచ్‌సీలు, 16 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. చాలా చోట్ల వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. ఇదే అదునుగా భావించి ఆ అధికారి డిప్యుటేషన్ల రూపంలో ఎక్కడపడితే అక్కడ దోచేశారని తెలిసింది. ఇటీవల సుమారు 19మంది వైద్యులు జిల్లాకు కేటాయించారు. వీరిలో ఇప్పటికీ 13మంది వరకు చేరారు. వీరి నుంచి కూడా వసులు చేశారని తెలిసింది.

Updated Date - Apr 12 , 2026 | 11:41 PM