ఎస్సార్బీసీ భూ సేకరణలో తప్పులు
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:14 AM
ఎస్సార్బీసీ కోసం చేపట్టిన భూసేకరణలో జరిగిన తప్పులు రీసర్వేతో బయటపడ్డాయి. పాణ్యం మండలంలోని కౌలూరులోని 473/ఏ భూమిలో కాలువ నిర్మాణానికి 1994లో భూసేకరణను ఎస్సార్బీసీ శాఖ చేపట్టింది.
రీసర్వే ద్వారా విషయం వెలుగులోకి..
భూమిని విక్రయించుకోడానికి రైతుల అవస్థలు
పరిశీలించిన అధికారులు
పాణ్యం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఎస్సార్బీసీ కోసం చేపట్టిన భూసేకరణలో జరిగిన తప్పులు రీసర్వేతో బయటపడ్డాయి. పాణ్యం మండలంలోని కౌలూరులోని 473/ఏ భూమిలో కాలువ నిర్మాణానికి 1994లో భూసేకరణను ఎస్సార్బీసీ శాఖ చేపట్టింది. అయితే భూసేకరణ జరిగిన చోట కాకుండా 466 సర్వే నెంబరులో కాలువ నిర్మాణం చేపట్టింది. రైతు ఈ భూమికి సంబంధించిన నష్ట పరిహారం రైతుకు చేరింది. మిగిలిన భూమిని రైతు సాగు చేసుకుంటున్నాడు. కాగా ఇటీవల భూమిని అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే రైతు సాగు చేసుకుంటున్న భూమి ప్రభుత్వానిదేనని ఎస్సార్బీసీ కాలువకు భూసేకరణలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. దీంతో తన భూమి 473/ఏ సర్వే నెంబరులో పోయిందని పేర్కొన్నాడు. దీంతో రెవెన్యూ అధికారులు రీసర్వే చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో రైతు పీజేఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేయడంతో పాటు మరి కొందరు రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కోవడంతో పీజేఆర్‌ఎస్‌లో తమ సమస్యలను తహసీల్దారు దృష్టికి తీసుకువచ్చారు.. దీంతో పాణ్యం తహసీల్దారు నరేంద్రనాథ్‌రెడ్డి, ఎస్సార్బీసీ ఏఈ సుబ్బారావు శనివారం జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. భూసేకరణ జరిగిన భూమితో పాటు రైతు సాగు చేసుకుంటున్న భూములను కలెక్టరు అనుమతితో సబ్ డివిజన్ చేయడానికి ప్రతిపాదనలు తయారు చేయాల్సి ఉందని తహసీల్దారు తెలిపారు. కలెక్టరు అనుమతి మేరకు రైతుల సర్వే నెంబర్లను ఆన్‌లైన్ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రాము, వీఆర్వోలు, ఎస్సార్బీసీ సిబ్బంది పాల్గొన్నారు.