Share News

సీమలో క్షిపణి పరీక్షలు

ABN , Publish Date - May 23 , 2026 | 11:58 PM

యావత్‌ భారత ప్రజల హృదయాలు పులకించేలా రక్షణ రంగం క్షిపణుల ప్రయోగాలు విజయఢంకా మోగిస్తున్నాయి.

సీమలో క్షిపణి పరీక్షలు
ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద ఏర్పాటు చేసిన డీఆర్‌డీవో నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌ క్షిపణి ప్రయోగ కేంద్రం

మిస్సైల్‌ ప్రయోగాల్లో ఓర్వకల్లు డీఆర్డీవో ప్రత్యేక గుర్తింపు

విజయవంతంగా నాలుగు క్షిపణుల ప్రయోగం

తొలిసారి 2019లో యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణి

తాజాగా అత్యాధునిక వార్‌ డ్రోన్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్‌

యావత్‌ భారత ప్రజల హృదయాలు పులకించేలా రక్షణ రంగం క్షిపణుల ప్రయోగాలు విజయఢంకా మోగిస్తున్నాయి. ఓర్వకల్లు డీఆర్డీవో కేంద్రంగా జరుగుతున్న ఈ పరీక్షలు సీమకే తలమానికంగా నిలుస్తున్నాయి. కర్నూలు గడ్డపై నుంచి శాస్త్రవేత్తలు దేశ రక్షణ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పారు. డీఆర్‌డీవో చేపట్టిన నాలుగు క్షిపణుల (మిస్సైల్స్‌) ప్రయోగాలు విజయవంతం కావడం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ విజన్‌ దిశగా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో కీలక ముందడుగు వేసింది. మంగళవారం డ్రోన్‌ ద్వారా ప్రయోగించే గైడెడ్‌ మిస్సైల్‌ (యూఏవీ లాంచ్‌డ్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ మిస్సైల్‌ - యూఎల్‌పీజీఎం -వీ3) ఓర్వకల్లు డీఆర్డీవో టెస్ట్‌ రేంజ్‌లో విజయవంతంగా ప్రయోగించారు. ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌, సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు అందరి నోట వినిపించేది ఒకటే.. అదే ఓర్వకల్లు. తమ ఊరు వేదికగా రక్షణ అస్ర్తాల పరీక్షలు దిగ్విజయం కావడానికి పాలకొలను సహా వివిధ గ్రామాల రైతులు తమ జీవనాధారమైన పంట చేలను రైతులు వదులుకున్నారు.

కర్నూలు, మే 23 (ఆంధ్రజ్యోతి): భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) దాదాపు 41 పైగా ప్రయోగశాలలు, ఐదు డీఆర్డీవో యంగ్‌ సైంటిస్ట్‌ లాబొరేటరీ (డీవైఎస్‌ఎల్‌)లు కలిగిన సంస్థ. ఇండియన్‌ ఆర్మీకి చెందిన టెక్నికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (టీడీఈ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్రొడక్షన్‌ (డీటీడీపీ)లు డిఫెన్స్‌ సైన్స్‌ ఆర్గనేజేషన్‌ కలయికతో 1958లో ఆవిర్భవించింది. ఈ సంస్థ ఎరోనాటిక్స్‌, అత్యాధునిక ఆయుధాలు, ఎలకా్ట్రనిక్స్‌, యుద్ధ రంగంలో పోరాట వాహనాలు, ఇంజనీరింగ్‌ సిస్టమ్స్‌, ఇన్‌స్టు్ట్రమెంటేషన్‌, మిస్సైల్స్‌, అడ్వాన్స్‌డ్‌ సిమ్యులేషన్‌ సిస్టమ్స్‌.. వంటి వివిధ విభాగాలు కవర్‌ చేసే రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో కీలకంగా పని చేస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగం, శిక్షణలు, సమాచార వ్యవస్థ, క్షిపణులు, ఆయుధాలు, తెలికపాటి యుద్ధవిమానాలు, రాడార్లు, ఎలక్రానిక్‌ వార్‌ఫేర్‌ సిస్టమ్స్‌ మొదలైన అభివృద్ధి, ప్రయోగాలలో గణనీయమైన విజయాలు అందుకుంది. అంతటి ప్రతిష్టాత్మకమైన డీఆర్‌డీవోను ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే మూడు క్షిపణుల ప్రయోగాల్లో విజయఢంకా మోగించిన ఓర్వకల్లు డీఆర్డీవో.. మంగళవారం భూమిపై ఉన్న శత్రు ట్యాంకులు, వాహనాలతో పాటు, ఆకాశంలో శత్రు డ్రోన్లను, హెకలికాప్టర్లను సైతం ధ్వంసం చేసే, అత్యాధునిక వార్‌ డ్రోన్‌ మిస్సైల్‌గా పిలిచే డ్రోన్‌ ద్వారా ప్రయోగించే గైడెడ్‌ మిస్సైల్‌ (యూఏవీ లాంచ్‌డ్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ మిస్సైల్‌ - యూఎల్‌పీజీఎం-వీ3) విజయవంతంగా ప్రయోగించారు. పరీక్ష సక్సెస్‌తో కోట్లాది భారతీయులు కర్నూలు వైపు చూశారు.

పాలకొలను వద్ద ఓర్వకల్లు డీఆర్డీవో

ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామ సమీపంలో 2015లో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఏర్పాటు చేశారు. కర్నూలు నగరానికి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఓర్వకల్లు మండలం పాలకొలను, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, కాల్వ, వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామాలు, అక్కడి పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఆనాటి డీఆర్‌డీఓ డైరెక్టర్లు సీవీ బాలాజి, డీవీఎస్‌ఆర్‌ మూర్తి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శంకర్‌రావు డీఆర్‌డీవో సంస్థ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, భద్రత, క్షిపణులు, అత్యాధునిక యుద్ధ పరికరాలు ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుందని కేంద్ర రక్షణ శాఖకు నివేదిక ఇచ్చారు. నాటి సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం డీఆర్‌డీవో ఏర్పాటు కోసం 2,781 ఎకరాలు కేటాయించింది. ఎకరాకు రూ.2 లక్షలు కేంద్ర ప్రభుత్వం భూ పరిహారం చెల్లిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం పట్టాభూమి రైతులకు ఎకరాకు రూ.5 లక్షలు, అసైన్డ్‌ పట్టా భూమికి ఎకరాకు రూ.4.30 లక్షలు చొప్పున భూ పరిహారం చెల్లించారు. రూ.570 కోట్లతో ఈ సంస్థను అభివృద్ధి చేశారు.

విజయవంతంగా నాలుగు మిస్సైల్‌ ప్రయోగాలు

ఓర్వకల్లు డీఆర్డీవో నేషనల్‌ ఓపెన్‌ ఏరియా రేంజ్‌ (ఎన్‌ఓఏఆర్‌) కేంద్రంగా ఇప్పటి వరకు నాలుగు మిస్సైల్స్‌ (క్షిపణులు)ను విజయవంతంగా ప్రయోగించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ విజన్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్షిపణులు ఇక్కడ ప్రయోగించడం కొసమెరుపు. ఓర్వకల్లు ఆకాశంలో ఆత్మనిర్భర్‌ గర్జన..! అంటూ పలువురు కొనియాడుతున్నారు. రాయలసీమ గడ్డపై కర్నూలు నుంచి గగనతలం వరకు.. డీఆర్డీవో అద్భుతం సృష్టించింది. శత్రువుల భరతం పట్టే నాలుగు గైడెడ్‌ మిస్సైల్స్‌ ప్రయోగాలు సంపూర్ణ విజయవంతం కావడంతో రాయలసీమ గడ్డ.. భారత రక్షణ రంగానికి అడ్డాగా మారిందని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యంగా దేశ రక్షణ రంగంలో నవ్యాంధ్ర మరో చారిత్రాత్మక మైలురాయిని అధిరోహించింది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలు, గగనతలంలో దాడులను ముందే పసిగట్టి ఛిద్రం చేయగల దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణులు సక్సెస్‌ కావడం దేశ రక్షణ వ్యవస్థకు సరికొత్త బలాన్ని చేకూర్చిందనే చెప్పాలి.

ఓర్వకల్లు డీఆర్డీవో కేంద్రంగా ప్రయోగించిన క్షిపణులు

తొలి ప్రయోగం: 2019 సెప్టెంబరు 11న పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి ‘మ్యాన్‌ -పోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ (ఎంపీఏటీజీఎం) ఇక్కడ మూడోసారి విజయవంతంగా పరీక్షించారు. ఒక సైనికుడు భుజంపై లేదా ట్రైపాడ్‌ సాయంతో మోసుకెళ్లి శుత్రువుల ట్యాంకర్లను ధ్వంసం చేసే అత్యాధునిక సాంకేతికతను ఇందులో పరీక్షించారు. ఈ విజయంతో ఓర్వకల్లు దేశ రక్షణ రంగ పరీక్షా పటంలోకి చేరింది.

రెండో ప్రయోగం: 2025 ఏప్రిల్‌ 13న రక్షణ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన లేజర్‌ డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్‌ (డీఈడబ్ల్యూ ఎంకే-2ఏ) ఇక్కడే డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఈ కాంతి పుంజం (లేజర్‌ కిరణాలు) క్షిపణి వ్యవస్థ ద్వారా గగనతలంలో దూసకొచ్చే శత్రువుల డ్రోన్లు, యుద్ధ విమానాలను క్షణాల్లో గుర్తించి వాటి సెన్సార్లను నిర్వీర్యం చేసి కూల్చివేయచ్చు. ఆధునాతన ఫ్యూనరిస్టిక్‌ ‘స్టార్‌ వార్స్‌’గా పేర్కొంటున్న లేజర్‌ డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్‌ (డీఈడబ్ల్యూ) ఎంకే-2(ఏ) పరీక్షతో భారత్‌ అగ్రరాజ్యాల సరసన చేరింది.

మూడో ప్రయోగం: 2025 జూలై 25న మానవరహిత డ్రోన్ల (యూఏవీ) ద్వారా శత్రువులపై ఖచ్చితమైన దాడి చేయాలనే లక్ష్యంగా రూపొందిం చిన డ్రోన్‌ ఆధారిత గైడెడ్‌ మిసైల్‌ (యూఏవీ లాంచ్‌డ్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ మిస్సైల్‌ - యూఎల్‌పీజీఎం -వీ3) తొలి ప్రయోగాత్మక పరీక్ష ఇక్కడే విజయవంతంగా నిర్వహించారు. డ్రోన్‌ ద్వారా గగనతలం నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది విజయవంతంగా ఛేదించింది.

నాలుగో ప్రయోగం: ఈ నెల 19 వార్‌ డ్రోన్‌ మిస్సైల్‌గా పిలిచే డ్రోన్‌ ద్వారా ప్రయోగించే గైడెడ్‌ క్షిపణీ (యూఎల్‌పీజీఎం -వీ3) తుది ప్రయోగ పరీక్ష (ఫైనల్‌ కాన్ఫిగరేషన్‌ ట్రయల్స్‌) ఓర్వకల్లు నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌ కేంద్రంగా డీఆర్డీవో నిర్వహించింది. గగనతలం నుంచి భూమికి (ఎయిర్‌ టు గ్రౌండ్‌), గగనతలం నుంచి గగనతలానికి (ఎయిర్‌ టు ఎయిర్‌) రెండు విభాగాల్లోనూ క్షిపణి సామర్థ్యాన్ని దిగ్విజయంగా పరీక్షించారు. సాధారణంగా డ్రోన్ల నుంచి ప్రయోగించే క్షిపణులను.. భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, బంకర్లు, రాడార్లను ధ్వంసం చేయడానికి వాడుతారు. అయితే.. ఈ మిస్సైల్‌ భూమిపై ఉన్న శత్రు ట్యాంకులు, వాహనాలతో పాటు, గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను సైతం ధ్వంసం చేయగలదు.

ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను

వార్‌ డ్రోన్‌ మిస్సైల్‌గా పిలిచే డ్రోన్‌ ద్వారా ప్రయోగించే గైడెడ్‌ క్షిపణి (యూఎల్‌పీజీఎం -వీ3) ఓర్వకల్లు డీఆర్డీవో నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌ కేంద్రంగా విజయవంతంగా ప్రయోగించడం స్థానిక ఎమ్మెల్యేగా ఎంతో గర్వపడుతున్నాను. ఈ ప్రయోజగం విజయవంతం చేసిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, నిపుణులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ప్రధాని మోదీ మహా సంకల్పంతో ముందుకు తీసుకెళుతున్న ఆత్మనిర్భర్‌ భారత్‌ విజన్‌లో భాగంగా ఈ క్షిపణి అభివృద్ధి చేయడం, రెండు దశల్లోనూ ఇక్కడే విజయవంతంగా పరీక్షలు చేయడం హర్షించదగ్గ విషయం. ఓర్వకల్లు కేంద్రంగా డీఆర్డీవోను ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, భారత రక్షణ రంగంలో కీలకమైన నాలుగు క్షిపణులను ఇక్కడే ప్రయోగించడం గర్వంగా ఉంది. సీఎం చంద్రబాబు విజన్‌-2047లో భాగంగా ఇండస్ర్టియల్‌ నోడ్‌గా అభివృద్ధితో పాటు క్షిపణుల ప్రయోగాలతో ఓర్వకల్లు ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు.

- గౌరు చరిత, పాణ్యం ఎమ్మెల్యే

Updated Date - May 23 , 2026 | 11:58 PM