Share News

గాడి తప్పింది

ABN , Publish Date - May 29 , 2026 | 11:50 PM

రెవెన్యూ శాఖలో పాలన గాడి తప్పిందనే విమర్శలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి.

గాడి తప్పింది

రెవెన్యూ శాఖలో నిర్లక్ష్యం

పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్స్‌కు అర్జీల వెల్లువ

పరిష్కారం కాని సమస్యలు

లోపించిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

రెవెన్యూ శాఖలో పాలన గాడి తప్పిందనే విమర్శలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు పరిష్కారం కాకపోగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లు, స్పెషల్‌ క్యాంపులో ప్రతి వారం వందలాది అర్జీలు వెల్లువెత్తుతున్నా వాటి పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్లు అందుబాటులో ఉండకపోవడం, స్పందించకపోవడంతో బాధితులు వేలాది రూపాయలు ఖర్చు చేసుకుని నేరుగా కలెక్టరేట్‌కు పరుగులు తీస్తున్నారు. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురవుతోంది.

కర్నూలు కలెక్టరేట్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెవెన్యూ శాఖ పాలన గాడి తప్పుతోంది. గ్రామస్థాయిలో భూ సమస్యలు, పాస్‌బుక్‌ల జారీ, జాయింట్‌ ఎల్పీఎంలు, సర్వే పొరపాట్లు, చుక్కల భూముల సమస్యలు, విస్తీర్ణ తేడాలు వంటి సమస్యలతో రైతులు నెలల తరబడి నరకం చూస్తున్నారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం మాత్రం కేవలం కంప్యూటర్లలో ‘పరిష్కారం’ అంటూ మార్క్‌ చేసుకుని చేతులు దులుపుకుంటోందే తప్ప.. బాధితులకు న్యాయం చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. కాగితాల్లో పరిష్కారాలు చూపిస్తూ పైఅధికారుల వద్ద మార్కులు కొట్టేసే ప్రయత్నంలో క్షేత్రస్థాయిలో రైతుల కన్నీళ్లు పాలకులకు కనిపించకుండా చేస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

సమస్యలు మరింత జటిలం

జిల్లాలో ఆర్‌ఎస్‌ డిప్యూటీ తహసీల్దార్లకు స్పష్టమైన జాబ్‌ చార్జ్‌ లేకపోవడంతో భూ సమస్యలు మరింత జటిలంగా మారుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఏసీ రూముల్లో కూర్చుని చేసే తప్పుల వల్ల ఒకరి ఎల్పీఎం మరొకరి పేరుతో నమోదు కావడం, రైతుల సొంత పట్టా భూములు ప్రభుత్వ భూమిగా మారిపోవడం, విస్తీర్ణం తగ్గిపోవడం వంటి ఘోర తప్పిదాలు జరుగుతున్నాయి. నిరుపేద రైతులు కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరగలేక, అటూ సాగు చేసుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. రెవెన్యూ శాఖలో అత్యంత కీలకమైన ఓ అధికారి వ్యవహారశైలిపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులు స్వయంగా వచ్చి వినతిపత్రాలు అం దజేసినా సరే వాటిపై స్పందన కరువైంది. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదన్న విమర్శలు న్నాయి. జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబధించి నమోదైన 106 ప్రతికూల వార్తల్లో ఏకంగా 95వార్తలు ఇంకా పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెవెన్యూ శాఖను దారిలోకి తెచ్చి పెండింగ్‌ అర్జీలపై తక్షణ సమీక్ష జరపాలని జిల్లా ప్రజలు, రైతులు కోరుతున్నారు.

సమస్యల పరిష్కారంలో విఫలం

రెవెన్యూ శాఖలో వివిధ కార్యక్రమాల ద్వారా స్వీకరించిన అర్జీలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారు. పెండింగ్‌లో వేలాది అర్జీలు ఉన్నాయి. సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించిన రైతులకు నిరాశ మిగిలింది. కర్నూలు జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో 1,191 ఫిర్యాదులు నమోదు కాగా అందులో 60 అర్జీల సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఇప్పటి వరకు 275 అర్జీలకు అధికారులు సమాధానం ఇవ్వలేదు.

రెవెన్యూ డిపార్టుమెంట్‌లో పీజీఆర్‌ఎస్‌ వివరాలు

మొత్తం వచ్చిన దరఖాస్తులు : 26,018

అధికారులు చూడనివి : 27

అధికారులు చూసినవి : 2..571

పురోగతిలో ఉన్నవి : 2.291

పరిష్కారమైనవి : 21,062

రీఓపెన్‌ అయినవి : 307

రెవెన్యూ క్లినిక్‌ వివరాలు:

ఆదోని డివిజన్‌లో: (ఆర్‌వోఆర్‌) :

మొత్తం దరఖాస్తులు : 1,522

పెండింగ్‌లో ఉన్నవి : 670

22 (ఏ):

మొత్తం దరఖాస్తులు : 471

పెండింగ్‌లో ఉన్నవి : 328

సమస్యలను గాలికొదిలేశారు

కూటమి ప్రభుత్వం ప్రజలసంక్షేమం కోసం కృషి చేస్తోంది. కానీ అధికారుల నిర్లక్ష్యం వలన పీజీఆర్‌ఎస్‌ రెవెన్యూ క్లీనిక్‌ స్పెషల్‌ క్యాంపులలో అర్జీలు ఇచ్చినా కూడా పరిష్కారం కావడం లేదు. జిల్లా రెవెన్యూ శాఖాధికారులు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు.

- పీటీ సాయిప్రదీప్‌, బీజేపీ రాష్ట్ర నాయకుడు, కర్నూలు

సమస్యలను పరిష్కరించాలి

అర్జీదారులు తమ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్లు, ఆర్డీవోలు, సబ్‌ కలెక్టర్లు, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యల పరిష్కారానికి డీఆర్వో ప్రత్యేక చొరవ తీసుకోవాలి

-వీవీ నాయుడు, రాయలసీమ యువజన పోరాట సమితి అధ్యక్షుడు, కర్నూలు

అధికారులపై చర్యలు తీసుకుంటాం

ప్రజల సమస్యలను ప్రతి అధికారి పరిష్కరించాలి. అర్జీలను పరిష్కరించకుంటే సంబంధిత అధికారి వివరణ ఇవ్వాలి. అర్జీలను పరిష్కరించని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

- నూరుల్‌ ఖమర్‌, జేసీ, కర్నూలు

Updated Date - May 29 , 2026 | 11:50 PM