Share News

లక్షల రాజకీయం

ABN , Publish Date - Mar 30 , 2026 | 11:37 PM

లక్షల రాజకీయం

లక్షల రాజకీయం
మాట్లాడుతున్న ఆదోని టీడీపీ సీనియర్‌ నాయకులు సౌదీ రవూఫ్‌

ఎమ్మెల్యే రూ.10లక్షలు లంచం ఇచ్చా : టీడీపీ నేత రవూఫ్‌

అవన్నీ అసత్య ఆరోపణలే : ఎమ్మెల్యే పార్థ

ఆదోనిలో హాట్‌ టాఫిక్‌గా తాజా వివాదం

‘ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్‌ సాక్షిగా చెబుతున్నా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి రూ.10 లక్షలు లంచం ఇచ్చా. మిగిలిన రూ.40 లక్షలు ఇవ్వనందుకే ఆయన నా బిల్డింగ్‌ నిర్మాణాన్ని ఆడ్డుకుంటున్నారు. నా భవన నిర్మాణానికి అనుమతుల పేరుతో ఎమ్మెల్యే భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాడు..’

- టీడీపీ సీనియర్‌ నాయకుడు సౌదీ రవూఫ్‌

‘అక్రమ కట్టడాలను కూల్చి తీరుతాం. అక్రమ భవనాలకు పాల్పడే వారి భరత పడతాం. పెద్ద మసీదుకు చెందిన వక్ఫ్‌ బోర్డు ఆస్తులను కబ్జా చేసి ముస్లిం సమాజానికి అన్యాయం చేస్తున్నావు.. నీ అక్రమ వ్యాపారాలు, నీ క్యారెక్టర్‌ ఏంటో ఆదోని ప్రజలందరికీ తెలుసు. నీ ఆటలు ఇక సాగవు’

- సౌదీ రవూఫ్‌పై ఎమ్మెల్యే పార్థసారథి ఫైర్‌

ఆదోని, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఆదోని పట్టణంలో ప్రస్తుతం రూ.లక్షల రాజకీయం చోటు చేసుకుంటోంది. తన భవన నిర్మాణానికి ఎమ్మెల్యేకు రూ.10 లక్షలు లంచం ఇచ్చానని టీడీపీ సీనియర్‌ నాయకుడు సౌదీ రవూఫ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. నిజానికి రూ.50 లక్షలు అడిగితే ముందుగా రూ.10 లక్షలు ఇచ్చానని, మిగతా రూ.40 లక్షల కోసం వేధిస్తున్నాడంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఆరోపణలపై స్పందించిన మంత్రి పార్థసారథి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తనపై బురదచల్లాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇకపై ఆ ఆటలు సాగవని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పట్టణంలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతానని ఆయన స్పష్టం చేశారు. ఎంఐజీ కాలనీకి సమీపంలో టీడీపీ నాయకుడు సౌదీ రవూఫ్‌ ఓ భవనాన్ని నిర్మించుకుంటున్నాడు. అయితే ఆ భవన నిర్మాణానికి అనుమతులు సరిగ్గా లేవన్న నెపంతో మున్సిపల్‌ అధికారులు తన ఇంటి నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారని ఆయన సోమవారం ఆరోపించారు. ఇదే క్రమంలో ఇంటి భవన నిర్మాణానికి అనుమతలు కోసం ఎమ్మెల్యే భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ సౌదీ రవూఫ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేతో రూ.50 లక్షలకు డీల్‌ కుదరగా ముందస్తుగా రూ.10లక్షలు ఇచ్చానని ఆయన ఆరోపించారు. తాను చెప్పేది పచ్చి నిజం అని ఇదే విషయాన్ని మసీదులో ఖురాన్‌ పట్టుకుని చెబుతానన్నారు. అంతేకాదు దేవాలయానికి వచ్చి భగవద్గీత, చర్చిలోకి వెళ్లి బైబిల్‌ మీద ప్రమాణం చేస్తానన్నారు. ఎమ్మెల్యే పార్థసారథికి రూ.10లక్షలు ఇచ్చింది వాస్తవమంటూ ఆయన కుండబద్దులు కొట్టారు. మిగిలిన రూ.40 లక్షలు చెల్లించలేనని తెగేసి చెప్పినందుకే మున్సిపల్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఉసిగొల్పి తన బిల్డింగ్‌ను కూల్చడానికి ప్లాన్‌ చేశారని ఆరోపించారు. ఎటువంటి నోటీసులు లేకుండానే పోలీసు బందోబస్తుతో రావడం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. ‘ఇది డీవియేషన్‌ కాదు... ఇది కేవలం దాదాగిరి, మామూళ్ల దందా..’ అంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.12 లక్షలు ఖర్చు చేసి అప్రూవల్‌ తెచ్చుకున్నాక కూడా ఇంకా డబ్బులు అడగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కావాలనే టీడీపీ నాయకులను టార్గెట్‌ చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, తన ప్రాణం పోయినా ఇక ఒక్క పైసా కూడా లంచం ఇచ్చే ప్రసక్తే లేదని రవూఫ్‌ తెగేసి చెప్పారు. ఏడుసార్లు కౌన్సిలర్‌గా గెలిచానని, మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసిన తనకే ఈ పరిస్థితి వస్తే సామాన్యుల గతి ఏమిటన్నారు. ‘ఎమ్మెల్యే గారు అడిగిన రూ.40 లక్షలు ఇవ్వలేనందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారు’ అంటూ ఆరోపించారు.

అక్రమ కట్టడాల కూల్చివేత ఖాయం

ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం

ఆదోని పట్టణాన్ని అక్రమ కట్టడాల వల్ల నాశనం కానివ్వనని ఎమ్మెల్యే పార్థసారథి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన సౌదీ రవూఫ్‌ నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడే ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ‘చట్టాన్ని అతిక్రమించి బిల్డింగ్‌లు కడితే అవి ఎవరివైనా సరే.. కూల్చివేత తప్పదు. నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేయాలని చూస్తే అదరను, బెదరను..’ అంటూ ఘాటుగా స్పందించారు. పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత సౌదీ రవూఫ్‌ అనే వ్యక్తి పెద్ద మసీదుకు చెందిన వక్ఫ్‌ బోర్డు ఆస్తులను కబ్జా చేసి ముస్లిం సమాజానికి అన్యాయం చేశాడన్నారు. ఆయన అక్రమ వ్యాపారాలు, క్యారెక్టర్‌ ఏమిటన్నది ఆదోని ప్రజలందరికీ తెలుసన్నారు. ఆయనలాంటి కబ్జాదారుడి దగ్గర డబ్బులు తీసుకునే ఖర్మ తనకు పట్టలేదన్నారు. తనపై బురద చల్లాలని చూస్తే ఆయన ఆటలు సాగవని హెచ్చరించారు.

‘రోడ్లను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా 30 నుంచి 40 శాతం డీవియేషన్‌లతో బిల్డింగ్‌లు కడుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే కనీసం మనుషులు వెళ్లడానికి కూడా గ్యాప్‌ లేకుండా నిర్మిస్తున్నారు. కూటమి నాయకుడిని అని చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ప్రజల పక్షమే నా పోరాటం అని నేను ప్రజలకు మాత్రమే జవాబుదారీని అని నోటీసులు ఇస్తే... ఎమ్మెల్యే డబ్బులు అడిగాడని అబద్ధపు ఆరోపణలు చేయడం ఏమిటి..’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తనలో నిజాయితీ ఉన్నంతవరకు ఎవరికీ భయపడనన్నారు. పట్టణంలోని ప్రతి అక్రమ కట్టడంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేసినందుకు గానూ సౌదీ రవూఫ్‌ 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ సీనియర్‌ నేత, సీనియర్‌ న్యాయవాది లోకేశ్‌ హెచ్చరించారు.

Updated Date - Mar 30 , 2026 | 11:37 PM