Share News

ఆహారంలో చిరు ధాన్యాలు ప్రత్యేకం

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:25 PM

ఆరోగ్యకరమైన ఆహారంలో చిరుధాన్యాలు ప్రత్యేకమైనవని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

ఆహారంలో చిరు ధాన్యాలు ప్రత్యేకం
స్టాల్స్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రభుత్వ ప్రోత్సాహం

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఆరోగ్యకరమైన ఆహారంలో చిరుధాన్యాలు ప్రత్యేకమైనవని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. గురువారం నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ అండ్‌ న్యూట్రిషన్‌ మిషన్‌లో భాగంగా పీజీఆర్‌ఎస్‌ హాల్లో జిల్లా స్థాయి చిరుధాన్యాల మేళా, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషకాలు సమృద్ధిగా ఉండే చిరు ధాన్యాల వినియోగం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో తొలిసారిగా ఆయిల్‌ పామ్‌ సాగుతో పాటు వేరుశనగ, నువ్వుల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. చిరుధాన్యాలతో తయారు చేసే ఉత్పత్తులకు ప్యాకింగ్‌, బ్రాండింగ్‌, ప్రాసెసింగ్‌ కల్పించడం ద్వారా మార్కెట్‌ విలువ పెంచుకోవచ్చన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ.. చిరుధాన్యాలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచేందుకు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎఆర్‌ఎస్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ జయలక్ష్మి, నంద్యాల డీడీఏ గంగాధర్‌రావు, మెప్మా పీడీ వెంకటదాసు, డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, డీపీఎం శ్రీనివాసులు, నాబార్డు డీడీఎం కార్తీక్‌, ఎల్డీఎం అయ్యపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 11:25 PM