ఆదోని డివిజన్‌లో స్వల్పంగా కంపించిన భూమి
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:14 PM
ఆదోని డివిజన్‌లోని మూడు మండలాల్లో క్షణకాలంలో భూమి స్పల్పంగా కంపించింది.
మూడు మండలాల్లో ప్రభావం
ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు
ఆదోని రూరల్/ హోళగుంద/ ఆస్పరి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆదోని డివిజన్‌లోని మూడు మండలాల్లో క్షణకాలంలో భూమి స్పల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆదోని మండలంలోని ఢణాపురం, నారాయణపురం, సాదారపురం గ్రామాల్లో గురువారం రాత్రి 8 గంటల సమయంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ గ్రామాల్లో రిక్టర్ స్కేల్‌పై 3.5 నమోదైనట్లు తహసీల్దార్ వేణుగోపాలరావు తెలిపారు. హొళగుంద మండలంలోని హెబ్బటం, ఎల్లార్తి, పెద్దహ్యాట పరిసర గ్రామాల్లో భూమి కంపించింది. గురువారం రాత్రి 8:07 గంటల సమయంలో భారీ శబ్దంతో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఎల్లార్తిలో ఇళ్లలోని సామాన్లు కింద పడిపోయాయి. క్షణ కాలం పాటు ఏం జరిగిందో అర్థం కాక ప్రజలు పరుగులు తీశారు. ఆస్పరి మండలం లోని కలపల, తురువగల్లు, తోగల్‌గల్లు, బిల్లేకల్, కైరుప్పల, అట్టేకల్ గ్రామాల్లోనూ భూమి కంపించింది. ఈ గ్రామాల్లోనూ రాత్రి 8:07 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయి.