పట్నం బాట పట్టిన పల్లెలు
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:04 PM
గోనెగండ్ల మండలం నుంచి వలసలు రోజురోజకు పెరుగుతున్నాయి. గురువారం మండల కేంద్రమైన గోనెగండ్ల తో పాటు మండలంలోని పలు గ్రామాల నుంచి దాదాపు 10 బోలోరో వాహనలలో వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు వలస బాట పట్టారు.
సంక్రాంతి తర్వాత వలసలు
మళ్లీ ఉగాదికే గ్రామాలకు
గోనెగండ్ల, జనవరి 22(ఆంధ్రజ్యోతి): గోనెగండ్ల మండలం నుంచి వలసలు రోజురోజకు పెరుగుతున్నాయి. గురువారం మండల కేంద్రమైన గోనెగండ్ల తో పాటు మండలంలోని పలు గ్రామాల నుంచి దాదాపు 10 బోలోరో వాహనలలో వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు వలస బాట పట్టారు. సంక్రాంతి పండుగ ముగియడంతో వలసలు బాట పట్టారు. గోనెగండ్ల నుంచి గురువారం దాదాపు 30 కుటుంబాలు గుంటూరుకు వలస పోయారు. అక్కడ మిర్చి పనులలో పని కుదుర్చుకున్నారు. మిర్చి పంట తెంపితే రూ. 500 లు, పంటను రోడ్డుకు మోసేందుకు గాను ఒక్కరికి కూలీ రూ. 700 ప్రకారం రెండు పూటల బోజనం కూడా పొలం యజమానే ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదుర్చుకొని బయలు దేరారు. గోనెగండ్ల నుంచి కూలీలు అందరు రాజంపేట, సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం ముసలపూర్ గ్రామంకు వెళ్లాతున్నారు. అక్కడ పత్తి పొలాలలో పత్తి, వేరుశనగ పంటలను తీసేందుకు కూలీ కుదుర్చు కున్నారు. దీంతో గ్రామాల్లోని వీదులు నిర్మాణుషంగా కనిపిస్తున్నాయి. ప్రతి రోజు గోనెగండ్ల మండలం నుంచి గుంటూరు, హైదరాబాదు, రాజంపేట తదితర ప్రాంతాలకు కడుపు చేత పట్టు కోని వలసలు వెలుతున్నారు. స్థానికంగా పొలం పనులు లేక పోవ డం కారణంగా వలసలు పోతున్నట్లు కూలీలు తెలుపుతున్నారు. గుంటూరు, తెలంగాణా ప్రాంతాల్లో పత్తి పొలాల్లో పనులు ఉన్నాయని అక్కడ ఉగాది పండుగ వరకు పనులు చేసుకొని స్వంత గ్రామానికి వస్తామని కూలీలు అంటున్నారు.
కోసిగి టూ గుంటూరు...
కోసిగి: సంక్రాంతి పండుగ చేసుకుని వలస కూలీలు వలసబాట పట్టడంతో గ్రామాలన్నీ ఖాళీ అవుతున్నాయి. మండల పరిధిలోని కందుకూరు, అగసనూరు, సాతనూరు, చిర్తనకల్, దుద్ది, ఆర్లబండ, చింతకుంట తదితర గ్రామాల నుంచి వందలాది కుటుంబాలు వలసబాట పట్టారు. గురువారం కందుకూరు గ్రామం నుంచే సుమారు 150 కుటుంబాలకు పైగా బొలేరో, ఐచర్ వాహనాల్లో గుంటూరుకు పిల్లాపాపలతో కలిసి వలస బాట పట్టారు. అలాగే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ చేసుకుని మూడు నెలల పాటు గుంటూరు, హైదరాబాదు, బెంగుళూరు వంటి నగరాలకు పిల్లా పాపలతో కలిసి ఇంటికి తాళాలు వేసి మూటముర్లు సర్దుకుని వలసబాట పట్టారు. అందులో భాగంగానే రెండు రోజుల నుంచి మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు వలసబాట పట్టారు. గురువారం కోసిగిలోని రైల్వేస్టేషన్‌లో వలస కూలీలతో కిక్కిరిసింది. కోసిగి నుంచి కర్ణాటకకు వెళ్లేందుకు ముంబై-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలులో వందలాది కుటుంబాలు పిల్లా పాపలతో కలిసి వలస వెళ్లిపోయారు. స్థానికంగా కూడా పనులు అంతంత మాత్రంగానే ఉండటంతో వలస తప్పదని, ఎన్నో ఏళ్ల నుంచి వలస వెళ్లిపోయి వస్తున్నామనీ, స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి పురుషులకు, మహిళలకు ఇక్కడే పనులు లభిస్తే ఇక్కడే ఉంటామన్నారు. కూలీలతో పాటు బడులలో చదువుకునే పిల్లల్ని సైతం వెంట తీసుకెళ్లిపోయారు.
చిన్నకడబూరులో 30 కుటుంబాలు...
పెద్దకడబూరు: పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నకడబూరులో గురువారం దాదాపు 30కుటుంబాలకుపైగా వలస బాట పట్టాయి. గత కొన్ని నెలలుగా గ్రామంలో పనులు లేకపోవడంతో గ్రామంలోని కూలీలు వలస బాట పట్టారు. గ్రామాల్లో ఉపాధి పనులను కూడా చేపట్టకపోవడంతో చేసేదిలేక ప్రజలు తెలంగాణ, కర్ణాటక, గుంటూరు ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.