Share News

కూలీల వలసబాట..

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:17 AM

గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు వలస బాట పట్టారు. ఇక పత్తి, వేరుశనగ, పంట పొలాల్లో పనులు చేసేందుకు కూలీలు దొరక్క పోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఉన్న అరకొర కూలీలు సైతం పనులకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. కూలిరేటు అమాంతంగా పెంచేశారు. ఎండలు మండుతున్నాయి మేము కూలీలకు రామంటున్నారు.

కూలీల వలసబాట..
గోనెగండ్ల నుంచి వలస వెలుతున్న కూలీలు

పత్తి పంట పొలాల్లోనే..

ఫ రైతన్న విలవిల

గోనెగండ్ల, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు వలస బాట పట్టారు. ఇక పత్తి, వేరుశనగ, పంట పొలాల్లో పనులు చేసేందుకు కూలీలు దొరక్క పోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఉన్న అరకొర కూలీలు సైతం పనులకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. కూలిరేటు అమాంతంగా పెంచేశారు. ఎండలు మండుతున్నాయి మేము కూలీలకు రామంటున్నారు. దాంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. చేతికి వచ్చిన పత్తి పంట ఎక్కడ పోతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయానికి కూలీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక చేసేది లేక కూలీలు ఎంత అడిగితే అంత ఇస్తూ పనులు చేయించుకుంటున్నారు. పలు గ్రామాల నుంచి 15 రోజులుగా వలస బండ్లు కదులుతున్నాయి. గ్రామాల నుంచి హైదరాబాద్‌, బొంబాయి, గుంటూరు, రంగారెడ్డి, రాజంపేట, గుంటూరు, కడప, ఒంగోలు పాంత్రాలకు కూలీలు వలసలు వెళ్తున్నారు. దాదాపు ఇప్పటికి 5వేల నుంచి 7వేల మంది వలసల వెళ్లినట్లు తెలిసింది. స్థానికంగా పంట పొలాల్లో పనులు ఉన్నప్పటికి కూలి గిట్టు బాటు కావడం లేదని కూలీలు తెలుపుతున్నారు.

స్థానిక పనులకు కూలీలు కరువు

గ్రామాల్లో చాలా మంది కూలీలు వలసబాట పట్టడంతో స్ధానిక పొలం పనులు చేసేందుకు కూలీలు దొరకడం లేదు. దీంతో మిరప, పత్తి, వేరుశనగ పంటలను సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కూలీలు ఎంత కూలి అడిగితే అంత ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు.

ఇబ్బంది పడుతున్నాం

పది ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాను. అరకొరగా పత్తి పంట చేతికి వచ్చింది. అయితే పత్తిని తీసేందుకు కూలీలు గ్రామంలో దొరకడం లేదు. ఉన్నవారంతా వలసబాట పట్టారు. కూలీలు దొరికి ఉంటే పనులు త్వరగా జరిగేవి. గ్రామంలో ఉన్న కొద్ది మంది కూలీలు కూలీ ధరలను అమాంతంగాపెంచారు. కేజీ పత్తికి రూ. 16 అడుగుతున్నారు. దాంతో కుటుంబ సభ్యులమే కష్టపడుతున్నాం. - రాముడు, గంజహళ్లి, రైతు

కౌతాళం నుంచి వలస

పనులు కల్పించని ఉపాధి అధికారులు

వలసలను నివారించడంలో ప్రజాప్రతినిధులు విఫలం

కౌతాళం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఎన్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు కురువకపోవడంతో గ్రామాల్లో వ్యవసాయ పనులు లేవు. మరోవైపు ఉపాధి అధికారులు ఎలాంటి పనులు కల్పించకపోవడంతో కూలీలు వలసబాట పడుతున్నారు. శనివారం రాత్రి కౌతాళం నుంచి సుమారు 75 కుటుంబాలు తెలంగాణకు వలస వెళ్లారు. మండలంలో వలసలను నివారించడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శిస్తున్నారు. గ్రామస్థులు ఉసేని, రంగమ్మ శివయ్య మాట్లాడుతూ తెలంగాణలో పత్తితీత పనులు మొదలైయ్యాయని, ఇక్కడే ఉంటే పూటగడవడం కష్టమైతుందన్నారు. పొట్టనింపుకునేందుకు కుటుంబాలుగా వలస పోతున్నామని తెలిపారు. అలాగే వీరారెడ్డి మాట్లాడుతూ గతేడాది అధిక వర్షాల వల్ల, ఈ ఏడాది వర్షాల్లేక తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తీర్చుకునేందుకు కుటుంబంతో కలిసి తెలంగాణకు వెళ్తున్నామన్నారు. ఒక్కరోజే సుమారు 75కుటుంబాలు వలసపోవడంతో గ్రామం జనాలు లేక బోసిపోయింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలవేళ వలసలను నివారించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని పలువురు విమర్శిస్తున్నారు.

Updated Date - Oct 26 , 2026 | 12:17 AM