సెలవు రోజుల్లోనూ ‘మధ్యాహ్నం’
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:14 AM
పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. అదనపు తరగతులతో పాటు సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. తాజాగా పదోతరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజనం అమలుకు శ్రీకారం చుట్టింది.
పదో తరగతి విద్యార్థుల్లో ఆనందం
చాగలమర్రి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. అదనపు తరగతులతో పాటు సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. తాజాగా పదోతరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజనం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈనెల 7వ తేదీ నుంచి ఈవిధానం అమ లులోకి రానుంది. మార్చి 10వ తేదీ వరకు దీనిని కొనసాగించనుంది. విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా పరిధిలో ఇలా..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, బీసీ, కేజీబీవీ, జడ్పీ పాఠశాలల్లో సుమారు 25,449 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరు ఈ ఏడాది ‘పది’ పబ్లిక్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెల 2వ శనివారం, ప్రతి ఆదివారంతో పాటు ఇతర సెలవుల రోజుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక బోధన కొనసాగిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే కొంత మంది విద్యా ర్థులు క్యారేజీలు తెచ్చుకోలేక పోవడంతో మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడేవారు. కూటమి ప్రభుత్వం తాజాగా సెలవురోజుల్లోను మధ్యాహ్న భోజనం అమలు చేస్తుండటంతో తమ ఆకలి బాధలు తప్పాయని పలువురు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
‘మధ్యాహ్నం’ అమలు అభినందనీయం
వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక చొరవ చూపుతున్నాం. ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం సెలవుల్లో కూడా అమలు చేయడం అభినందనీయం. - జీవయ్య, హెచ్‌ఎం, చాగలమర్రి
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం
విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రణాళికా ప్రకారంగా బోధన చేస్తున్నారు. సెలవు రోజుల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు వల్ల పూర్తి సమయం చదువుకు కేటాయించొచ్చు. - జనార్దన్‌రెడ్డి, డీఈవో, నంద్యాల