Share News

పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:00 AM

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే సమయానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సన్నద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే సమయానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సన్నద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, డీఆర్వో రామునాయక్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని 6 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 212 ఎన్నికల వార్డులు, 511 పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనుల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గత ఎన్నికల అనుభవాలు, స్థానిక పరిస్థితులు, శాంతి భద్రతలను పరిగణలోకి తీసుకొని పోలీసులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సెన్సిటివ్‌, హై పవర్‌ సెన్సిటివ్‌ కేంద్రాలను త్వరగా ఖరారు చేయాలన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు అవసరమైన ప్రింటర్లను గుర్తించి, పోలింగ్‌ సిబ్బంది వివరాలను సేకరించి సమగ్ర డేటా బెస్‌ సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ, ఓట్ల లెక్కింపునకు అవసరమైన రిసెప్షన్‌, డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రాలు, స్ర్టాంగ్‌ రూంలను ముందుగానే గుర్తించాలన్నారు. బ్యాలెట్‌ పేపర్ల నంబరింగ్‌, సీలింగ్‌, స్వస్తిక్‌ ముద్ర వినియోగం తదితర అంశాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాలు ముందస్తు సన్నాహాలను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు.

ఓటర్ల జాబితాను పునఃపరిశీలించాలి

సర్‌ ప్రక్రియలో భాగంగా తొలగించిన ఓటర్ల జాబితాలో ప్రతి పేరును క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ... అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, అనర్హుల పేర్లు ఓటర్ల జాబితాలో లేకుండా పారదర్శకంగా తప్పులు లేని జాబితాను రూపొందించాలన్నారు. జిల్లాలో తొలగించిన 1,81,545 మంది ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పునఃధ్రువీకరించాలని మరణం, శాశ్వత వలస, ఆచూకీ లభించకపోవడం, బహుళ నమోదు తదితర కారణాలతో తొలగించిన ప్రతి పేరును నిశితంగా పరిశీలించాలన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:00 AM