కర్నూలు జిల్లాలో మెగా పీటీఎం
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:19 AM
జిల్లాలోని 1476 ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహించారు. కర్నూలు నగరంలో ఎ. క్యాంపులోని ఇందిరాగాంధీ స్మారక నగర పాలక ఉన్నత పాఠశాలలో కలెక్టర్ డా.ఏ. సిరి పాల్గొన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన్, జూలై 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 1476 ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహించారు. కర్నూలు నగరంలో ఎ. క్యాంపులోని ఇందిరాగాంధీ స్మారక నగర పాలక ఉన్నత పాఠశాలలో కలెక్టర్ డా.ఏ. సిరి పాల్గొన్నారు. టౌన్ మోడల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, బి. క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో రవీంద్ర విద్యాసంస్థల ఫౌండర్ జి. పుల్లయ్య, కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి, డీఎస్పీ మహబూబ్ బాషా, స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం అత్యంత కీలకమన్నారు. పిల్లలు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో, ఏ విషయాల్లో మరింత శ్రద్ధ అవసరమో ఉపాధ్యాయులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తల్లిదండ్రులకు సూచించారు. లీప్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. 2024 వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 100 పాఠశాలలో 235 అభివృద్ధి పనులకు రూ.34 కోట్లను వ్యయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 1400 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, డెస్క్‌లు, భవనాలకు పెయింటింగ్, మరుగుదొడ్లు, తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు వంటి పనులు కొనసాగుతున్నాయన్నారు. గత మెగా డీఎస్సీ ద్వారా అత్యధికంగా ఉపాధ్యాయులను కేటాయించారని, ప్రస్తుతం ఉన్న 1600 ఖాళీలను కూడా రాబోయే మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. టౌన్ మోడల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం పర్యవేక్షణ ఎంతో కీలకమన్నారు. పిల్లల చదువులు వారి పరివర్తన పురోగతి గురించి తెలుసుకోవడానికి ఇలాంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగులు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ జి.పుల్లయ్య, కేవీ సుబ్బారెడ్డి కళాశాలల చైర్మన్ డా.కేవీ సుబ్బారెడ్డి, డీఎస్పీ మహబగూబ్ బాషా, ఏపీఈడబ్లూఐడీఎస్ రాష్ట్ర డైరెక్టర్ బి. నాగమణి మాట్లాడుతూ నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్య శిక్షణ, క్రమ శిక్షణ అధ్యాపకుల అంకిత భావాన్ని కొనియాడారు. డీవీఈఓ సురే్‌షబాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లల భవిష్యత్తు గురించి అధ్యాపకులతో సంప్రదిస్తూ ఉండాలన్నారు. జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి రవికుమార్, డీఈవో సుధాకర్, ఆర్‌ఐవో జి. లాలెప్ప, డీబీసీ డబ్ల్యూవో దేవెళ్ల సురేష్, ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయలు, అధ్యాపకులు పాల్గొన్నారు.