Share News

దళా’రూల్స్‌’

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:54 PM

సి.క్యాంపు రైతు బజార్‌లో దళారుల రాజ్యం కొనసాగుతోంది. వారిదే హవా నడుస్తోంది. ఇక్కడ రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

దళా’రూల్స్‌’
కిందనే కూర్చుని టమోటా విక్రయిస్తున్న రైతు

సి.క్యాంపు రైతు బజారులో దళారుల హవా

చేతులెత్తేస్తున్న అధికారులు, సిబ్బంది

పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు రైతుల ఇబ్బందులు

కర్నూలు అగ్రికల్చర్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): సి.క్యాంపు రైతు బజార్‌లో దళారుల రాజ్యం కొనసాగుతోంది. వారిదే హవా నడుస్తోంది. ఇక్కడ రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గత మే నెల సి.క్యాంపు రైతుబజారులో పర్యటించినప్పుడు జిల్లా స్థాయి అధికారులు మొదలు రాష్ట్రస్థాయి అధికారులంతా రైతులను అరుగులపై కూర్చోబెట్టారు. సీఎంకు మాయమాటలు చెప్పేశారు. ముఖ్యమంత్రి ఎంతో సంతోషించారు. నెల తిరిగిందో లేదో రైతులను అరుగుల నుంచి కింద పడేసి దళారులు మళ్లీ అరుగులపై చేరి దర్జాగా కూరగాయలు అమ్ముకుంటున్నారు. రాష్ట్రంలోనే రైతుల చేత కూరగాయలను అమ్మించి వారికి గిట్టుబాటు ధర అందించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలను అందిస్తున్న రైతుబజార్‌గా సి.క్యాంపు రైతుబజార్‌ గుర్తింపు పొందింది. ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, జిల్లా అధికారుల సిఫారసులు, ఆదేశాలే చెల్లుబాటు అవుతున్నాయి.

ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని మొర..

ఏళ్ల తరబడి ఈ రైతుబజారులోనే విధులు నిర్వర్తిస్తున్నా సెక్యూరిటీ గార్డులు దళారులను గట్టిగా నోరెత్తి ఏమీ అనలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని దూర ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకుని వచ్చి ఎంతో వ్యయ ప్రయాసలకు గురవుతున్నామనీ కొంతైనా మాకు స్థలాలు కల్పించేలా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని మొర పెట్టుకుంటున్నారు.

స్థలం దొరక్క..

అరుగుల మీద దళారులు దర్జాగా కూర్చుకుని కూరగాయలు విక్రయిస్తుంటే కనీసం నేలపై స్థలం దొరక్క రైతులు మధ్యాహ్ననానికే అందినకాడికి కూరగాయలను అమ్మేసి, మిగిలిన వాటిని చెత్తకుప్పలో పడేసి ఇంటి దారి పడుతున్నారు. ఎస్టేట్‌ అధికారి కళ్యాణమ్మ, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ శివకుమార్‌ ప్రస్తుతం రైతులకు రైతుబజారులో కూరగాయలు అమ్ముకునేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని, మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించుకుంటున్నా ఆ అధికారి తన చేతిలో ఏమీ లేదని, మీరే ఎలాగూ ఒకలా దళారులకు సర్ది చెప్పి రైతులకు న్యాయం చేయాలని చెబుతున్నారని, తన వల్ల ఏమీ కావడం లేదని మొర పెట్టుకుంటున్నారు. ఓ దశలో వీరంతా రైతుబజారులో విధులు నిర్వర్తించలేమంటూ చేతులెత్తేస్తున్నారు. పక్కా రైతుబజార్లకు బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.

ఉన్నతాధికారులకు సమస్య నివేదిస్తాం

సి.క్యాంపు రైతుబజారులో ప్రస్తుతం దళారుల సమస్య ఎక్కువైపోతోంది. రైతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారిని కూరగాయలు అమ్ముకునేందుకు అవకాశం కల్పించినా దళారులు రైతులపై, మాపై దౌర్జన్యం చేస్తున్నారు. దళారులను సి. క్యాంపు రైతుబజార్‌ నుంచి బయటకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. - కళ్యాణమ్మ, ఎస్టేట్‌ అధికారి, సి.క్యాంపు రైతు బజారు

Updated Date - Mar 03 , 2026 | 11:54 PM