మధ్యవర్తిత్వం అవసరం
ABN , Publish Date - Aug 01 , 2026 | 11:29 PM
కక్షిదారుల కేసుఉ త్వరగా పరిష్కారం కావడానికి మధ్యవర్తిత్వం అవసరమని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి అన్నారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి
కర్నూలు లీగల్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కక్షిదారుల కేసుఉ త్వరగా పరిష్కారం కావడానికి మధ్యవర్తిత్వం అవసరమని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి అన్నారు. శనివారం స్థానిక న్యాయ సేవాసదన్ భవన్‌లో మధ్యవర్తిత్వంపై జరిగిన ఓ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు మధ్యవర్తిత్వంపై చొరవ తీసుకుని తమ కక్షిదారులకు మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించి వారి కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా తోడ్పడాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి హైకోర్టుతో పాటు జిల్లాలోని అన్ని కోర్టులలో మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించడానికి తీర్మానించినట్లు ఆయన తెలిపారు. మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించేందుకు ఈ ఏడాది డిసెంబరు 31 వరకు ఉమ్మడి ప్రచారాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కోర్టులలో నిర్వహిస్తామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సీపీసీలోని సెక్షన్ 89 కింద మధ్యవర్తిత్వం అవలంబించాలని తెలిపారు.