Share News

నీటి సమస్య తీర్చడానికి చర్యలు

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:44 PM

నీటి సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

నీటి సమస్య తీర్చడానికి చర్యలు
బనగానపల్లెలో మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

నేటి నుంచి వారం పాటు అవుకు రిజర్వాయర్‌కు నీరు విడుదల చేస్తాం

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): నీటి సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఎస్సార్బీసీ ఎస్‌ఈ లక్ష్మణ్‌నాయక్‌, ఈఈ భవాని ప్రసాదరెడ్డి, ఇతర ఏఈలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఆదివారం నుంచి వారం పాటు గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి ఎస్సార్బీసీ కాలువ ద్వారా అవుకు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. స్థానిక పరిస్థితుల గురించి సీఎం చంద్రబాబు, ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల నాయుడుకు వివరించి తాగునీటి కోసం నీటిని విడుదల చేయిస్తున్నామని చెప్పారు. అంగీకరం తెలిపిన ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోతుండడం, బోర్లు ఎండిపోతుండడం, ప్రజలకు తాగునీటి సమస్య, పశు, పక్ష్యాదులకు తాగునీరు లేకుండా పోవడంతో నీటిని విడుదల చేయించినట్లు తెలిపారు. ఎస్సార్బీసీ ద్వారా ఒక వారం రోజుల పాటు నీటిని తీసుకు వెళ్తే కాల్వ వెంబడి వాగులు, వంకలతో పాటు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లు రీచార్జి అవుతాయన్నారు. పశువులు, తాగునీటి కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు రైతులకు ఇప్పటికే వివరించామని చెప్పారు. వారంరోజులు మాత్రమే నీరు వస్తుందని, ఈ విషయాన్ని గ్రహించి దయచేసి పంటలు వేసుకోకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మే, జూన్‌ నెలలో కూడా రైతులకు సాగునీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని, అయితే వైసీపీ నాయకులు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిడ్డారు.

Updated Date - Aug 29 , 2026 | 11:44 PM