Share News

తాగునీటి సమస్య లేకుండా చర్యలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:16 PM

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.

తాగునీటి సమస్య లేకుండా చర్యలు
గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

రుద్రవరం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. శుక్రవారం తుండ్లవాగు రిజర్వాయర్‌ నుంచి తెలుగుగంగ ప్రఽధాన కాలువకు 63వ కి.మీ. వద్ద గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీరు లేక ఒక వైపు వెలవెలబోతుంటే సాగునీటిపై వైసీపీ నాయకులు రైతులను రెచ్చగొట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులను వరి పంట సాగు చేయవద్దని ముందు నుంచే సూచిస్తున్నామని చెప్పారు. తాగునీటి అవసరాల అనంతరం ఆరుతడి పంటలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భావిస్తున్నామన్నారు. చెరువులు, కుంటలు నింపుకొని తాగునీటి అవసరాలకు వినియోగించాలని సూచించారు. 2027 జూన్‌ వరకు ఇదే నీటిని సురక్షితంగా వృఽథా కాకుండా వాడుకోవాలన్నారు. తుండ్లవాగు రిజర్వాయరును 0.35 నుంచి 0.63 సామర్థ్యం పెంచేందుకు రూ.40 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, అసెంబ్లీలో కూడా నీటి పారుదలశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు తాగునీటిని అందించారని కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాసరిహద్దులోని చింతల చెరువు వరకు కూడా నీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సుమారు 60 చెరువులు, కుంటలు ఉన్నాయని, వీటిని కేసీ కెనాల్‌, తెలుగుగంగ ద్వారా నింపాల్సిన అవసరం ఉందన్నారు. తుండ్లవాగు రిజర్వాయరు నుంచి ఆళ్లగడ్డ పట్టణంతో పాటు మరో 18 గ్రామాలు హరినగరం మంచినీటి పథకం ద్వారా తాగేందుకు నీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు మురళీకృష్ణ, రత్నరాజు, గురుమూర్తి, వెంకటరమణ, అనిల్‌కుమార్‌, ఏఈలు మోహనకృష్ణారెడ్డి, వినయ్‌కుమార్‌, నాయకులు శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 11:16 PM