భూగర్భజలాల పెంపునకు చర్యలు: కలెక్టర్
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:14 PM
జలధార- జలహారతి కార్యక్రమం కింద గొలుసుకట్టు చెరువుల అనుసంధానం, బేసిన్- సబ్ బేసిన్ స్థాయిలో నీటి వనరుల సమర్థ నిర్వహణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా నంద్యాల జిల్లాలో వినూత్న చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ రాజకుమారి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
నంద్యాల నూనెపల్లి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి) : జలధార- జలహారతి కార్యక్రమం కింద గొలుసుకట్టు చెరువుల అనుసంధానం, బేసిన్- సబ్ బేసిన్ స్థాయిలో నీటి వనరుల సమర్థ నిర్వహణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా నంద్యాల జిల్లాలో వినూత్న చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ రాజకుమారి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. శనివారం అమరావతి నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శిశుభూషణ్ కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ నుంచి కలెక్టర్ హాజరయ్యారు. సమావేశం మధ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనగా జలధార-జలహారతి కార్యక్రమం కింద జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల క్యాస్కేడ్ పరిధిలో ఎలాంటి అదనపు వ్యయం లేకుండా కేవలం ఎనిమిది రోజుల్లో 18 కి.మీ. మేర ఐదు గొలుసుకట్టు చెరువులను విజయవంతంగా అనుసంఽ దానం చేసిన విధానాన్ని రాష్ట్రానికి ఆదర్శప్రాయమైన విజయగాథగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బేసిన్, సబ్‌బేసిన్, మైక్రో బేసిన్ స్థాయిల్లో నీటి వనరుల సమగ్ర నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రికి నివేదించారు. సర్‌ప్లస్ బేసిన్ల నుంచి డెఫిసిట్ బేసిన్లకు నీటి సమతుల్యత సాధించే చర్యలతో పాటు గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, చెరువుల సుందరీకరణ, వర్షపునీటి సంరక్షణ కార్యక్రమాలను అమలు చేసినట్లు వివరించారు. ఆర్‌డబ్ల్యూఎస్ బావులను పీజోమీటర్లు వినియోగిస్తూ నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. భూగర్భ జలాల పెంపు దిశగా జిల్లాలో చేపడుతున్న చర్యల ఫలితంగా మేలో 7.54 మీటర్లుగా నమోదైన నీటి మట్టం గత నవంబర్ నాటికి 3.51 మీటర్లకు చేరిందని వెల్లడించారు. ప్రతి సీజన్‌కు కనీసం ఒక మీటర్ మేర భూగర్భ జలమట్టాన్ని మెరుగుపరచాలనే సంకల్పంతో అధికారులు కృషి చేస్తున్నారన్నారు. అంత కుముందు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులతో చెరువుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనుల పురోగతిని పరిశీలించారు. సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జోక్యం చేసుకొని ఇప్పటికే పరిపాలనా అనుమతులు పొందిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.