Share News

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:15 PM

జిల్లాలో మురసు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు
కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మురసు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. ముఖ్యంగా మార్కాపూర్‌, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ప్రాణనష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం నుంచి తుఫాను సంసిద్ధత, ఉద్యోగుల పనితీరు, ప్రజాభిప్రాయం, ఏపీ ఎఫ్‌ఆర్‌ఎస్‌, ఈ-ఆఫీస్‌, ఐగాట్‌ కర్మయోగి, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. దోర్నాల వైపు నుంచి ఆత్మకూరు నియోజకవర్గం, గిద్దలూరు వైపు నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 08514-293903 నంబరుకు ఫోన్‌ చేసి సాయం పొందాలన్నారు. సమావేశంలో జేసీ సూరజ్‌ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లకు తావివ్వకూడదు

గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, గ్రామీ ణ ఎన్నికల్లో ఎలాంటి లోపాలకు కూడా తావులేకుండా ఎంపీడీవోలు, ఆర్వోలు, జోనల్‌ అధికారులు ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వర్తించాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం నుంచి గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధతపై టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 11:15 PM