మహిళల స్వావలంబనకు చర్యలు: కలెక్టర్
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:47 PM
చేనేత, స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): చేనేత, స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 7 స్వయం సహాయక సంఘాలకు చెందిన 8 మంది సభ్యులకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ 10.20 లక్షల రుణం చెక్కును శుక్రవారం కలెక్టర్ రాజకుమారి అందజేశారు. ఆమె మాట్లాడుతూ రుణాలను సక్రమంగా వినియోగించుకొని జీవనోపాధిని విస్తరించుకోవాలని అన్నారు. డీఆర్డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుతం విడుదల చేస్తున్న నీరు కేవలం తాగునీటికి మాత్రమే వినియోగించాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి విడుదలౌతున్న నీటిని వెలుగోడు, గోరుక ల్లు, అవుకు రిజర్వాయర్లలో తాగునీటి ఆవసరాలను నిల్వ చేస్తారని అన్నారు. ప్రస్తుత ఖరీజ్ సీజన్‌లో రైతులు వరిసాగు చేపట్టకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని కోరారు.
ప్రస్తుతం రీసర్వే కోసం అందజేస్తున్న ల్యాప్‌టా్‌పలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని రీసర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని విలేజ్ సర్వేయర్లను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఏపీ సర్వే శాఖ ద్వారా సరఫరా చేసిన ల్యాప్‌టా్‌పలను విలేజ్ సర్వేయర్లకు పంపిణీ చేశారు. సర్వేశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీరామ్మోహన్, ఇన్‌స్పెక్టర్ ఆప్ సర్వే, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ఇన్నోవేటివ్ పర్‌ఫార్మర్ అవార్డుకు ఎంపిక: కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నేటివ్ అరకు కాఫీ కేంద్రం రాష్ట్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనపరిచినందుకు ఇన్నోవేటివ్ పర్‌ఫార్మర్ అవార్డుకు ఎంపికైందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె ఈ అవార్డును షేక్ ముబీన్‌కు అందజేసి అభినందించారు.