జీడీపీకి అరకొర నీరు
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:28 AM
గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టుకు వారం రోజుల క్రితం ఆదోని, పత్తికొండ, ఆస్పరి ప్రాంతాలలో కురిన వర్షం కారణంగా అరకొరగా వరద వచ్చి చేరింది.
తుంగభద్ర, శ్రీశైలం డ్యాముల్లో అడుగంటిన నీరు
టీబీలో 9.8 టీఎంసీలు మాత్రమే
శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ
రోజుకు 30 క్యూసెక్కుల నీరు ఆవిరి
గోనెగండ్ల, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టుకు వారం రోజుల క్రితం ఆదోని, పత్తికొండ, ఆస్పరి ప్రాంతాలలో కురిన వర్షం కారణంగా అరకొరగా వరద వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.4(గ్రాస్)టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు మళ్లీ వర్షం జాడ లేదు. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 4.5 టీఎంసీలు. జూన్ నెల చివరికి వచ్చినా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురియకపోవడంతో ప్రాజెక్టుకు వరద నీరు పెద్దగా వచ్చి చేరడం లేదు. ఈ కారణంగా ప్రాజెక్టు నీరు అరకొరగా ఉంది. ఈ ప్రాజెక్టు కింద డోన్, పత్తికొండ, క్రిష్టగిరి తాగునీటి పథకాలకు నీరు సరఫరా అవుతుంది. దాదాపు 120 గ్రామాలకు ప్రాజెక్టు నీరే తాగునీటి కింద సరఫరా అవుతు న్నాయి. అవసర సమయంలో కర్నూలు, కోడుమూరు, లద్దగిరి, గూడురు, సి.బెళగల్, గుడిపాడు ప్రాంతాలకు కూడా సరఫరా అవుతాయి. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో తాగునీటి పథకాలకు మాత్రం డోకా లేదని అధికారులు తెలుపుతున్నారు. గత ఏడాది రబీలో ప్రాజెక్టు కింద దాదాపు 13,000 ఎకరాలలో పంటలు సాగైంది. ఈ ఏడాదైనా వర్షాలు కురిసి ప్రా జెక్టుకు వరద వచ్చి చేరుతుందో లేదో వేచి చూడాలి. కాగా ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరితేనే ప్రాజెక్టు కింద ఆయకట్టు భూములు వచ్చే రబీ సీజన్‌లో పంట సాగుతో కళకళలాడుతాయి. కాగా ప్రతి రోజు ప్రాజెక్టులోని నీటి నుంచి 30 క్యూసెక్కుల నీరు ఆవిరి అయిపోతున్నాయి. వర్షం కోసం రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు.
గత ఏడాది ఈపాటికి వరద..
ప్రస్తుతం జీడీపీలో 2.4(గ్రాస్) టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది జాన్ నెల నాటికి ప్రాజెక్టుకు వరద వచ్చి చేరింది. అయితే ఈ ఏడాది ఇప్పటి అరకొరగానే వరద వచ్చి చేరింది. ప్రాజెక్టులో ఉన్న నీటిని ఇతర ప్రాంతాల వారు తమ రాజకీయ బలంతో నీటిని మళ్లించుకొని వెళుతున్నారు. దీంతో జీడీపీ చుట్టు పక్కల గ్రామాలకు తాగునీటి సమస్య వస్తే ఎలా అని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రతి రోజు జీడీపీలో దాదాపు 30 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కరవడం ఆలస్యం అయితే చుట్టపక్కల గ్రామాలకు తాగునీటి సమస్య వస్తే ఇబ్బంది అవుతుందని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
జీడీపీకి జీవనాడి తుంగభద్ర, శ్రీశైలం, డ్యామ్ నీరే
వర్షాలు కురవని సమయంలో కూడా జీడీపీకి జీవనాధారంగా ఉండేది తుంగభద్ర డ్యామ్, శ్రీశైలం డ్యామ్‌లలోని నీరే. అయితే ఈ ఏడాది ఆ రెండు డ్యామ్‌లలో నీటి మట్టం అడుగంటి పోయింది. శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ 210 టీఎంసీ కాగా ప్రస్తుతం ప్రస్తుతం 40టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక తుంగభద్ర డ్యామ్ కెపాసిటీ 105 టీఎంసీలు అయితే ప్రస్తుతం 9.8 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గత ఏడాది వర్షాలు కురియడంతో ఈ సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో 60 టీఎంసీల నీరు పైగానే చేరింది. దీంతో గత ఏడాది జూలై 10 నాటికి ఆంధ్ర వాటా కింద నీటి విడుదల చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వర్షపు నీటి చుక్క తుంగభద్ర డ్యామ్ ఎగువ ప్రాంతంలో కనిపించడం లేదు. శ్రీశైలంలో డెడ్ స్టోరేజి నీరు మాత్రం ఉంది. దీంతో ఇప్పట్లో నీటి విడుదల అయ్యే అవకాశం లేదని ఇరిగేషన్ అధికారులు తెలుపుతున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలైన నీటిని గోనెగండ్ల ఎస్కేప్ చానల్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టులోకి మళ్లించి నీరు నిలువ చేస్తారు. అలాగే హంద్రీ నీవా నీటి పథకం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ నీటిని దాదాపు 3 టీఎంసీల నీటిని గాజులదిన్నె ప్రాజెక్టుకు ఇరిగేషన్ అధికారులు మళ్లిస్తారు. అయితే శ్రీశైలం డ్యామ్‌కు ఇప్పటి వరద వచ్చి చేరలేదు. ఇది కూడా జీడీపీ ఇబ్బందికరమైన పరిణామమే. గాజులదిన్నె ప్రాజెక్టుకు వరదల ద్వారా నీరు రాకపోయినప్పటికీ తుంగభద్ర, శ్రీశైలం డ్యామ్‌ల ద్వారా వచ్చే నీరు సరిపోయేది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు తుంగభద్ర డ్యామ్, శ్రీశైలం డ్యామ్‌లలో డెడ్ స్టోరేజి నీరు మాత్రమే ఉంది. వర్షాలు కురిసి ఈ రెండు డ్యామ్‌లు నిండితేనే జీడీపీకి సంవృద్ధిగా నీరు. లేకపోతే గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటి కొరత తప్పదు.