Share News

వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

ABN , Publish Date - Sep 04 , 2026 | 11:33 PM

శ్రావణమాసం నాలుగో శుక్రవారం పురస్కరించుకుని ధర్మప్రచారంలో భాగంగా శ్రీశైల దేవస్థానం చెంచు గిరిజన మహిళలకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించింది.

వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

ఈ ఏడాది శ్రీశైల దేవస్థానం తరపున మూడోసారి నిర్వహణ

పాల్గొన్న 1200 మంది చెంచు మహిళలు

500 మంది ఇతర ప్రాంతాల భక్తులు

శ్రీశైలం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం నాలుగో శుక్రవారం పురస్కరించుకుని ధర్మప్రచారంలో భాగంగా శ్రీశైల దేవస్థానం చెంచు గిరిజన మహిళలకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించింది. ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కల్యాణ మండపంలో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు చేశారు. ఈ వ్రతంలో నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు చెందిన 1200 మంది గిరిజన చెంచు మహిళలతో పాటు 500 మంది ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొన్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కల్యాణ మండపం వేదికపై ఆశీనులైన స్వామి, అమ్మవార్లకు షోడశోపచార పూజలు చేసి లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పం పఠించిన అర్చకులు వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు విడివిడిగా కలశస్థాపన చేయించి శ్రీసూక్త విధానంలో వ్రత కథను వివరిస్తూ పూజకు కావాల్సిన ద్రవ్యాలను ఆందజేశారు. ముత్తైదువులకు అమ్మవారి ప్రసాదంగా చీర, రవిక వస్త్రం, పూలు, గాజులు, బిల్వం, తులసి మొక్కలు అందజేశారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు స్వామి, అమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో అలంకార దర్శనాలు కల్పించి అన్నప్రసాద వితరణ చేశారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆగస్టు 21న స్థానికులతో పాటు భక్తులకు, ఆగస్టు 28న శివ సేవకులకు, శుక్రవారం ప్రత్యేకంగా చెంచు గిరిజన మహిళల కోసం ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఐటీడీఏ అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ సురే్‌షకుమార్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కేపీ నాయక్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కేజీ నాయక్‌, ఆలయ పీఆర్వో శ్రీనివాసరావు, ఎడిటర్‌ అనిల్‌కుమార్‌, ఏఈవో వెంకటేశ్వరరావు, పర్యవేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2026 | 11:33 PM