వివాహిత ఆత్మహత్య
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:16 AM
పట్టణంలో ఓ వివాహిత ఆత్మహత్య పలు అనుమానాలకు దారి తీస్తోంది.
మృతిపై తల్లిదండ్రుల అనుమానాలు
అత్తింటివారే కొట్టి చంపారంటున్న తండ్రి
నందికొట్కూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఓ వివాహిత ఆత్మహత్య పలు అనుమానాలకు దారి తీస్తోంది. పట్టణంలోని సీపీఎం నాయకుడు నాగేశ్వరరావు కుమారుడు శివకుమార్‌కు మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మిదేవి నాలుగో కుమార్తె శివప్రియ(27)తో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర వయసున్న బాబు సంతానం. అయితే వేధింపులు అధికం అయ్యాయని, ఇంటికి రావాలని శివప్రియ సోమవారం ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ కాల్ చేసింది. ఫోన్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే శివప్రియ ఉరి వేసుకున్నట్లు సమాచారం రావడంతో మృతురాలి తండ్రి నాగరాజు హుటాహుటిన నందికొట్కూరుకు వచ్చాడు. తన అల్లుడు శివకుమార్ మద్యానికి బానిసై మొదటి నుంచి తన కుమార్తెను వేధించేవాడని బోరున విలపించాడు. నెల రోజుల క్రితం కూడా తన కుమార్తెను చితకబాది పుట్టింటికి పంపించాడని, ఆ సమయంలో సర్ధిచెప్పి తిరిగి కాపురానికి పంపామన్నారు. ఆదివారం రాత్రి విద్యుత్ వైరుతో కొట్టినట్లు సోమవారం ఉదయం తన కుమార్తె ఫోన్‌లో ఏడ్చిందన్నారు. ‘వచ్చి మాట్లాడండి నాన్న. ఈ వేధింపులు భరించలేకపోతున్నా..’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘ధైర్యంగా ఉండమ్మా.. సాయంత్రం వచ్చి మాట్లాడుతా’నని తండ్రి నాగరాజు సముదాయించాడు. గ్రామం నుంచి బయల్దేరిన నాగరాజుకు కాసేపటికే కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అల్లుడు శ్రీనివాస్ ఫోన్ చేశాడు. కుమార్తె మృతదేహాన్ని చూసిన తండ్రి నాగరాజు గుండెలు పగిలేలా రోధించిన తీరు ప్రతి ఒక్కరిని కలచివేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని భర్త, ఆయన కుటుంబ సభ్యులు కలిసి హత్య చేశారని తండ్రి నాగరాజు ఆరోపించారు. తన అల్లుడు, అతడి కుటుంబ సభ్యుల వేధింపులే మరణానికి కారణమని ఆయన ఆరోపించాడు. ఈ విషయంపై సీఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. బాధితులకు న్యాయం చేస్తామని ఆయన వెల్లడించారు.