ఎరువు... బరువు
ABN , Publish Date - May 12 , 2026 | 11:31 PM
ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువుల కంపెనీలు ధరల మోత మోగిస్తున్నాయి. ఒక బస్తాపై రూ.100 నుంచి రూ.200 దాకా అదనంగా పెంచేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
యుద్ధం నెపంతో మళ్లీ పెరిగిన ధరలు
ఉమ్మడి జిల్లా రైతులపై రూ.60 కోట్ల భారం
ఒక బస్తాపై రూ.100 నుంచి రూ.200 దాకా అదనం
రైతుల నడ్డి విరుస్తున్న ఎరువుల కంపెనీలు
కర్నూలు అగ్రికల్చర్, మే 11 (ఆంధ్రజ్యోతి): ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువుల కంపెనీలు ధరల మోత మోగిస్తున్నాయి. ఒక బస్తాపై రూ.100 నుంచి రూ.200 దాకా అదనంగా పెంచేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంటల సాగు భారమై పీకల్లోతు కష్టాల్లో ఉన్న తాము ఏడాదికి రెండుసార్లు ఎరువుల ధరలు పెరిగితే ఎలా బతకాలంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. మరో 20 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండటంతో ఈసారి పంటలు ఎలా సాగు చేయాలనే విచారంలో ఉన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఎరువుల తయారీ ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయని, అందువల్ల ఎరువుల ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీల యజమానులు అంటున్నారు. ఒక్కో బస్తాపై రూ.100 నుంచి రూ.200 దాకా అదనంగా ధర పెంచడంతో ఇప్పటికే ఎరువులను కొనలేక తల్లడిల్లుతున్న రైతులు కొత్తగా పెరిగిన భారం ఎలా మోయాలని అంటున్నారు. కర్నూలు జిల్లాలో రాబోయే ఖరీఫ్‌లో 4.20 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానంగా పంటల సాగుకు యూరియా 66,465 మెట్రిక్ టన్నులు, డీఏపీ 20,736 టన్నులు, పొటాష్ 3,901 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1,00,682 టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1,954 టన్నులు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎరువుల కంపెనీలు యూరియాతో పాటు డీఏపీ ధరను పెంచలేదు. మిగిలిన ఎరువుల ధరలను భారీగా పెంచేశారు. అయితే... యూరియా బస్తా రూ.266 మాత్రమే ఉన్నా రైతులకు అవసరం లేని లింక్ ఎరువులను కట్టబెట్టడంతో పాటు కృత్రిమ కొరతను సృష్టించి బస్తాపై రూ.100 నుంచి రూ.150ల దాకా వసూలు చేస్తున్నారు. అదే విధంగా డీఏపీ ఎరువు ధర రూ.1,350 కాగా, ఈ ఎరువు సప్లయ్ పూర్తిగా తగ్గించేశారు. ఒక బస్తా డీఏపీ ఎరువు ధర రూ.1,350 కాగా, కృత్రిమ కొరత సృష్టించి రూ.2వేల దాకా డీలర్లు వసూలు చేసుకుంటున్నారు. దీంతో ఈ రెండు ఎరువుల ధరలు పెంచకపోయినా బ్లాక్ మార్కెట్‌లో పెంచుకుంటూ రైతుల నడ్డి విరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుకునేందుకు వాటి తయారీ యజమానులకు అనుమతి ఇవ్వడం వల్ల ఉమ్మడి జిల్లా రైతులపై దాదాపు రూ.60 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే వివిధ కారణాల వల్ల పంట సాగుకు ఖర్చులు పెరిగిపోయి రైతులు పంట సాగు చేయలేని పరిస్థితి నెలకొంది.
పెరిగిన ధరలు ఇలా
ఎరువు రకం ఒక బస్తాపై పాత ధర పెంచిన ధర
10-26-26రకం రూ.2,050-00 రూ.2,250-00
28-28-0 రకం రూ.1,900-00 రూ.2,350-00
14-35-14 రకం రూ.2150-00 రూ.2,400-00
20-20-20-0-12 రకం రూ.1,500-00 రూ.1,800-00
15-15-15 రకం రూ.1,650-00 రూ.1,950-00
16-16-16 రకం రూ.1,650-00 రూ.1,950-00
16-20-0 రకం రూ.1,450-00 రూ.1,750-00
19-19-19 రకం రూ.2,075-00 రూ.2,300-00
ఎంవోపీ రకం రూ.1,800-00 రూ.1,975-00
పొటాష్ రూ.1,800-00 రూ.1,980-00
యూరియాతో పాటు డీఏపీ ఎరువుల ధరలును కంపెనీలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో పాత ధరలనే డీలర్లు వసూలు చేస్తున్నారు. అయితే.. లింక్ ఎరువులను తగలగట్టడంతో పాటు కృత్రిమ కొరత పేరుతో ఒక బస్తా ఎరువుపై రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తుండటంతో ఽతాము ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎరువుల ధరలను కట్టడి చేయడంలో ప్రభుత్వాలు విఫలం
ఎరువుల ధరలను ఏడాదికి రెండుసార్లు వివిధ కారణాలతో కంపెనీల యాజమాన్యాలు పెంచుకుంటూ పోతున్నారు. మరో వైపు ఈ ఎరువులను కృత్రిమ కొరతను సృష్టించి డీలర్లు భారీగా రైతుల నుంచి అదనంగా వసూలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం యూరియా డీఏపీ అంగళ్లలో కనిపించడమే గగనమైపోయింది. రైతులు యూరియాను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరను చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గ్రామాల్లో రాజకీయ నాయకులతో పాటు అధికారులు చెప్పిన వారికే యూరియా డీఏపీ ఎరువులు దొరుకుతున్నాయి. సామాన్య రైతులకు ఎరువులు దొరకడమే లేదు. వ్యవసాయశాఖ అధికారులు మొక్కుబడిగా తనిఖీలకు పరిమితమై డీలర్లతో కుమ్మక్కు కావడం వల్లే యూరియా, డీఏపీ ఎరువులకు కృత్రిమ కొరత ఏర్పడింది. కనీసం వచ్చే ఖరీఫ్‌లోనైనా ఎంఆర్‌పీ ధరలకే ఎరువులు రైతులకు అందించేలా వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి.
- రామకృష్ణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎమ్మార్పీ ధరలకే ఎరువులను విక్రయించాలి..
ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలకే ఎరువులను డీలర్లు రైతులకు విక్రయించాలి. అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఏ ఎరువు ధర ఎంతో అంగళ్ల వద్ద డీలర్లు బోర్డుపై రాసి రైతులకు కనిపించేలా ప్రదర్శించాలి. వ్యవసాయాధికారుల మొబైల్ ఫోన్ నెంబర్లను కూడా బోర్డులపై నమోదు చేయాలి. లింక్ ఎరువులను అంటగడితే రైతులు మా దృష్టికి తీసుకురావాలి. అధిక ధరను ఎవరూ చెల్లించకూడదు. డీలర్ల నుంచి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి.
-వరలక్ష్మి, జేడీ