Share News

మామిడి రైతు విలవిల

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:31 AM

మామిడి చెట్లకు తెగుళ్లు వ్యాపించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పూత, పిందె నేల రాలుతున్నాయని, ఎన్ని మందులు పిచికారీ చేసినా అదుపులోకి రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 2వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు ఉన్నా యి.

మామిడి రైతు విలవిల
ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామంలో తెగులుతో దెబ్బతిన్న మామిడి తోట

ప్యాపిలి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మామిడి చెట్లకు తెగుళ్లు వ్యాపించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పూత, పిందె నేల రాలుతున్నాయని, ఎన్ని మందులు పిచికారీ చేసినా అదుపులోకి రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 2వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు ఉన్నా యి. ప్యాపిలి, కలచట్ల, పోతుదొడ్డి, ఎర్రగుంట్లపల్లి, వెంగళాంపల్లి, ఏనుగమర్రి, గుడిపాడు, పీఆర్‌పల్లి తదితర గ్రామాల్లో రైతులు మామిడి తోటలు ఉన్నాయి. ఏడాదిగా నిర్వహణ ఖర్చులకు రూ.వేలు ఖర్చుచేశామని, తీరా పూత రాలుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పీడిస్తున్న తేనె మంచు, నల్లమచ్చ తెగులు..

జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మామిడికి పూత ఆశాజనకంగా రావడంతో రైతులు సంబరపడ్డారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీరుతాయని ఆశించారు. అంతలోనే పూత రాలిపోవడం తెగుళ్ల ప్రభావంతో, పిందెలు రాలిపోయి, రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

మందులు వాడినా అదుపులోకి రాలేదు..

తెగుళ్ల నివారణకు వ్యాపారులు సూచించిన వివిధ రకాల మందుల పిచికారీ చేసినా అదుపులోకి రాలేదనని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యావనశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తమకు సూచనలు, సలహాలు ఇచ్చి, తెగులు నివారణకు సహకరించాలని రైతులు కోరుతున్నారు.

తెగులు అదుపు కావడం లేదు

ఐదెకరాల్లో మామిడి తోట ఉంది. పూత బాగా వచ్చింది, అయితే తెగుళ్లు సోకడంతో రాలిపోతోంది. ఇప్పటికి నాలుగు సార్లు మందులు పిచికారీ చేసినా అదుపులోకి రాలేదు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. - శంకర్‌, ఏనుగమర్రి, ప్యాపిలి మండలం

సస్యరక్షణ చర్యలతో తెగుళ్లు నివారణ

సస్యరక్షణ చర్యలు పాటిస్తే తెగుళ్లను అదుపులోకి తేవచ్చు. వాతవరణ మార్పు ప్రభావంతో మామిడికి తెనె మంచు, నల్లమచ్చ తెగుళ్లు సోకాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. లీటరు నీటిలో బూఫ్రోఫేజిన్‌ 25 ఎస్‌సీ మందు 1.5 మి.లీ. కలుపుకొని తెగుళ్లు సోకిన చెట్లకు పిచికానీ చేయాలి. లేదా ఒక లీటర్‌ నీటిలో డైనోటాపురాన్‌ మందు 2మి.లీ. కలుపుకొని పిచికారిస్తే తెగులు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. - కళ్యాణి, ఉద్యానవనశాఖ అధికారి, ప్యాపిలి

Updated Date - Mar 01 , 2026 | 12:32 AM