Share News

హంస వాహనంపై మల్లన్న

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:17 PM

సర్వం శివమయం.. వేలాది గొంతుకల శివనామస్మరణ.. అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

హంస వాహనంపై మల్లన్న

కన్నుల పండువగా గ్రామోత్సవం

ఇంద్రకీలాద్రి ఆలయం నుంచి పట్టువస్త్రాలు

శ్రీశైలానికి వేలాదిగా శివభక్తులు

ఘనంగా సాగుతున్న మహా శివరాత్రి ఉత్సవాలు

శ్రీశైలం, పిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): సర్వం శివమయం.. వేలాది గొంతుకల శివనామస్మరణ.. అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేదమంత్రాల నడుమ.. శివపరివారం వెంటరాగా శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబ అమ్మవారితో హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కిక్కిరిసిన భక్తజన సందోహం నడుమ సాంస్కృతిక నృత్యాలు సాగుతుండగా స్వామివారి వాహనసేవ కన్నుల పండువగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం తరపున ఈఓ శ్రీను నాయ క్‌, చైర్మన్‌ రాధాకృష్ణలు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక అలంకృతులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించి హంసవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజాధికాలు, హరతులు సమర్పించి, అనంతరం మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవం ముందు కోలాటం, చెక్కభజన, రాజభటుల వేషాలు, పగటి వేషాలు, గురవయ్యలు, బుట్టబొమ్మల నృత్యాలు, భీరప్పడోలు, తప్పెట్లు, డ్రమ్స్‌, భజంత్రీలు, భంజారా నృత్యం, చెంచునృత్యం, శంఖునాదాలు మార్మోగాయి.

నేడు మయూరవాహన సేవ: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ వారం నాలుగో రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి మయూరవాహనసేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాలను ఆలయ దక్షణ మాఢవీధిలోని నిత్యాకళారాధన వేదిక, పుష్కరిణి ప్రాంగణంలోని భ్రామరీకళావేదిక, శివదీక్షాశిబిరాల ప్రాంగణంలో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాయంత్రం సంప్రదాయ కూచిపూడి, భరతనాట్యం నృత్య ప్రదర్శన తదితర కార్యక్రమా లు ఆకట్టుకున్నాయి. గ్రామో త్సవంలో ట్రస్ట్‌ బోర్డు సభ్యులు దేవకి వెంకటే శ్వర్లు, భర ద్వాజశర్మ, గంగమ్మ, శ్రీదేవి, శివ మ్మ, ఆలయ అధికారులు ఈఈ నర్సింహారెడ్డి, బాలమురళీ కృష్ణ, పీఆర్‌వో శ్రీనివాసరావు, ఎడిటర్‌ అనీల్‌ కుమార్‌లు ఉన్నారు.

నేడు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామిఅమ్మవార్లకు పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:17 PM