Share News

జలాధివాసంలో మల్లన్న

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:29 PM

దేశంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీశైలంలో చేపట్టిన వరుణయాగం వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.

జలాధివాసంలో మల్లన్న
అలంకార మండపంలో పూజలు చేస్తున్న అర్చకులు

శ్రీశైలంలో ఘనంగా సహస్ర ఘటాభిషేకం

నాలుగో రోజుకు చేరిన వరుణయాగం

నేడు యాగ పూర్ణాహుతి

శ్రీశైలం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీశైలంలో చేపట్టిన వరుణయాగం వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం మల్లికార్జున స్వామివారు పూర్తిగా జలాధివాసంలోకి వెళ్లారు. ప్రధాన ఘట్టమైన సహస్ర ఘటాభిషేకం జరిపించారు. తెల్లవారుజామున ఆరుద్ర నక్షత్ర పూజల తరువాత కృష్ణానది వద్ద ప్రత్యేక పూజలు చేసి పుణ్య జలాలను ప్రధాన కలశాలతో ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ ఈఓ శ్రీనివాసరావు, పాలకమండలి చైర్మన్‌ పోతుగుంట రమే్‌షనాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి అలంకార మండపంలో పుణ్య జలంతో ఉన్న కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు తలపై ఘటాలను పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా వచ్చి గర్భాలయ మూలవిరాట్టును అభిషేకించారు. ఘటాభిషేకంలో సామాన్య భక్తులతోపాటు స్థానికులు కూడా పాల్గొనేందుకు దేవస్థానం అవకాశం కల్పించారు. 1008 కలశాలతో చేసిన అభిషేక జలంతో సుమారు నాలుగు అడుగుల ఎత్తు వరకు నీటితో నిండిన మల్లికార్జునుడు మంగళవారం తెల్లవారుజాము వరకు జలాధివాసంలోనే ఉం టారు. మంగళవారం మధ్యాహ్నం తరువాత భక్తులకు యథావిధిగా ఆర్జిత సేవలు దర్శనాలు కల్పిస్తారు. మంగళవారం ఉద యం యాగ పూర్ణాహుతి, మహదాశీర్వచనం కార్యక్రమాలతో వరుణయాగం సంపూర్ణమవుతుంది. ఈ కైంకర్యాల్లో దేవదాయ శాఖ అదనపు కమిషనర్‌ ఎస్‌ఎస్‌ చంద్రశేఖర ఆజాద్‌, పాలకమండలి సభ్యులు ఏవీ రమణ, భరద్వాజశర్మ, దేవకి వెంకటేశ్వర్లు, సుబ్బలక్ష్మి, లక్ష్మీశ్వరి, శ్రీదేవి, శ్రీనివాసులు, కాశీనాథ్‌ ఎడిటర్‌ అనిల్‌ కుమార్‌, పీఆర్‌వో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 11:29 PM