సూర్యఘర్‌ను వినియోగించుకోండి
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:56 PM
పీఎం సూర్యఘర్ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు.
ఏ. గోకులపాడులో పర్యటించిన కలెక్టర్ సిరి
కల్లూరు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): పీఎం సూర్యఘర్ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం కల్లూరు మండలం ఏ. గోకులపాడు గ్రామంలో శిరోమణి, శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 23077 యూఎల్‌ఏ మోడల్ సోలార్ రూఫ్‌టాప్‌లను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందులో 17331 రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేసి 75శాతం లక్ష్యాన్ని సాధించామని, మిగిలిన 25శాతం లక్ష్యం త్వరితగతిన సాధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం ఏ. గోకులపాడులో శిరోమణి ఇంటిపై పీఎం సూర్యఘర్ పథకం యూఎల్‌ఏ మోడల్ కింద ఏర్పాటు చేసిన రూఫ్ టాప్‌ను పరిశీలించి గ్రామంలో ఎన్ని కుటంబాలకు ఏర్పాటు చేశారని కలెక్టర్ ఆరా తీయగా 87 మంది లబ్ధి పొందినట్లు అధికారులు కలెక్టరుకు వివరించారు.
33-11 కెవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్: బి. క్యాంప్‌ని 33-11 కెవీ సబ్‌స్టేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో విద్యుత్ వ్యవస్థ తదితర అంశాలను విద్యుత్‌శాఖ అధికారులు కలెక్టరుకు ప్రాక్టికల్‌గా వివరించారు. సంబందిత సబ్‌స్టేషన్ నుండి అరోరానగర్, మిలిటరీ కాలనీ, బి.క్యాంపు, గ్రాయత్రి ఎస్టేట్ తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎస్‌ఈ ఆర్. ప్రదీప్‌కుమార్, కర్నూలు టౌన్ ఈఈ మహేష్‌కుమార్, ఆర్డీఓ సందీప్‌కుమార్, కల్లూరు తహసీల్దారు కె.ఆంజనేయులు పాల్గొన్నారు.