లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:43 PM
డిసెంబరు 12వ తేదీన జరగబోయే జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి. వాసు అధికారులను ఆదేశించారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) వాసు
కర్నూలు లీగల్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 12వ తేదీన జరగబోయే జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి. వాసు అధికారులను ఆదేశించారు. స్థానిక న్యాయ సేవా సదన్ భవన్‌లో బుధవారం జరిగిన ఓ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జాతీయ లోక్‌అదాలత్‌లో కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులే కాక ప్రి లిటిగేషన్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. రాజీకి అర్హత ఉన్న సివిల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, సివిల్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు అధికారులు దృష్టి సారించి ఈ జాతీయ లోక్ అదాలత్‌లను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కోర్టులలో ప్రి లోక్‌అదాలత్ సిట్టింగులను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయాధికారులు సంధ్యారాణి, సరోజనమ్మ, అపర్ణ, అనూష, అనిల్ కుమార్, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, పలువురు బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
న్యాయాధికారులకు క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్ స్కీం
న్యాయాధికారులకు అత్యవసరమైన వైద్యసేవలు అందించడానికి వీలుగా క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ప్రారంభించినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి. వాసు తెలిపారు. స్థానిక న్యాయ సేవాసదన్ భవన్‌లో బుధవారం ఆయన ఈ స్కీమ్‌ను ప్రారంభించి పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా న్యాయాధికారులు, వారి కుటుంబ సభ్యులకు ప్రైవేటు ఆసుపత్రులలో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వైద్యసేవలను నగదు రహితంగా అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, జూనియర్ సివిల్ జడ్జీలు సంధ్యారాణి, సరోజనమ్మ, అపర్ణ, అనూష, అనిల్ కుమార్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.