Share News

పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:25 PM

పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీవోలతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈనెల 23న ఆయా మండల కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేరోజు పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదన్నారు. కచ్చితమైన జనాభా గణాంకాలే జిల్లా, రాష్ట్ర, దేశాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన సెన్సెస్‌ శిక్షణ చివరిరోజు కలెక్టర్‌ పాల్గొని మాస్టర్‌ ట్రైనర్లు, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లకు జనాభా గణన ప్రాధాన్యత, వివరాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అక్షరాంధ్ర’ను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 3,10,759 మందిని నిరక్ష రాస్యులుగా గుర్తించినట్లు వివరించారు. డీఆర్వో రామునాయక్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 11:25 PM