Share News

మొక్కజొన్న దిగుబడి నిరాశాజనకం

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:16 AM

రైతులు ఎన్నో వ్యయప్రయాసలు పడి మొక్కజొన్న సాగు చేస్తే దిగుబడి ఘోరంగా తగ్గిపోయింది. జి

మొక్కజొన్న దిగుబడి నిరాశాజనకం
కొలిమిగుండ్ల వద్ద కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట

జోరుగా సాగుతున్న నూర్పిడి

ఖరీ్‌ఫలో 1 లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగు

ఆందోళన చెందుతున్న రైతులు

కొలిమిగుండ్ల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రైతులు ఎన్నో వ్యయప్రయాసలు పడి మొక్కజొన్న సాగు చేస్తే దిగుబడి ఘోరంగా తగ్గిపోయింది. జిల్లాలో గతేడాది గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన మొక్క జొన్న రైతులు ఈ ఏడాది దిగుబడి లేక నష్టాలను చవిచూడాల్సి పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 1 లక్ష ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ప్రధానంగా కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లో రైతులు అధికంగా మొక్కజొన్న సాగు చేపట్టారు. ప్రస్తుతం మొక్క జొన్న నూర్పిడి చేస్తున్న రైతులకు దిగుబడి భారీగా తగ్గడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సహజంగా మొక్క జొన్న ఎకరాకు 35 క్వింటాళ్ల నుండి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అయితే ప్రస్తుతం 20క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. ఖరీ్‌ఫలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులే దిగుబడి తగ్గాడానికి ప్రధాన కారణమని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో కరువు మండలాలను ఎంపిక చేసింది. సంజామల మినహా జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చారు. దీంతో మొక్కజొన్న దిగుబడి సగానికి తగ్గడంతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆశాజనకంగా ధరలు

సజన్‌తో నిమిత్తం లేకుండా నీటి వనరుల కింద నిరంతరం సాగుచేసే మొక్కజొన్నకు ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా లభిస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో క్వింటాలు మొక్కజొన్న రూ.1500, రూ.1800 మాత్రమే పలకగా ప్రస్తుతం రూ.2800 వరకూ ధర పలుకుతోంది. ఇటీవలి కాలంలో మొక్కజొన్నకు ఈమాత్రం ధర పలకడం ఇదే కావడం గమనార్హం. దీంతో మొక్కజొన్న మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. అయితే దిగుబడి లేని సమయంలో ధరలు పెరిగినా ఉపయోగం లేకుండా పోయిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Nov 05 , 2026 | 12:16 AM