శ్రీగిరిపై మాఘ పౌర్ణమి పూజలు
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:01 AM
శ్రీశైల మహా క్షేత్రంలో మాఘ పౌర్ణమి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు.
భ్రామరికి లక్ష కుంకుమార్చన, ఊయలసేవ
గిరి ప్రదక్షిణలో భారీగా భక్తులు
శ్రీశైలం, ఫిబ్రవరి 01 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రంలో మాఘ పౌర్ణమి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాతసేవ, మహామంగళ హారతుల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. ఆదివారం సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రధాన ద్వారం గుండా పల్లకిలో తీసుకువచ్చి గంగాధర మండపం వద్ద ప్రచార రథంపై ఆశీనులచేసి దేవదాయశాఖ తిరుపతి మల్టీజోన్ 2 రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌తోపాటు ఏఈవో హరిదాసు తదితరులు అర్చక వేదపండితులతో కలిసి పూజాక్రతువులు నిర్వహించారు. గంగాధర మండపం నుండి ప్రారంభమైన ప్రచార రథం నంది మండపం మీదుగా గిరిప్రదక్షిణ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంది. అమ్మవారి అలయ ప్రాకారంలో ఏర్పాటు చేసిన ఊయలను పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవను జరిపించారు.
క్షేత్రంలో రద్దీ
మల్లన్నను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో క్షేత్రమంతా సందడిగా మారింది. ఆదివారం తెల్లవారుజామున తలనీలాలు సమర్పించుకుని నదీ స్నానాలు చేసి పసుపు కుంకుమలతో కృష్ణమ్మకు సారెలు సమర్పించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనాలకు వీఐపీ టిక్కెట్టు పొందిన వారికి ఉదయం, రాత్రి వేళల్లో మాత్రమే స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు. అతి శీఘ్ర దర్శనం, శీఘ్ర ఉచిత దర్శనం వారికి కూడా రెండు గంటల సమయం పట్టిదని ఈవో శ్రీనివాసరావు అన్నారు.
స్వామి అమ్మవార్లకు నృత్య నీరాజనం
కర్నాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ప్రగతి నృత్య కళా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆలయ దక్షిణ మాడవీధిలో కళా వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తి గీతాలకు చిన్నారులు శ్రావ్య, లక్ష్మి, శ్రీనిధి, దీక్షిత, లక్షిత, మోక్షితలు చేసిన నృత్యం అలరించింది.