Share News

‘లక్కు’ ఎవరికో..!

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:08 AM

కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీ చైర్మన్‌ పీఠాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి.

‘లక్కు’ ఎవరికో..!

చైర్మన్‌ అభ్యర్థుల ఎంపికపై పార్టీల్లో అంతర్మథనం

రిజర్వేషన్లు ఖరారు.. ఆశావహుల్లో ఉత్కంఠ

టీడీపీ టికెట్‌ కోసం తీవ్ర పోటీ

బరిలో దిగేదెవరు? సమరంలో తలపడేదెవరు?

కర్నూలు సహా ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు పట్టణాల్లో ఆసక్తి చర్చ

కర్నూలు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీ చైర్మన్‌ పీఠాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అధిష్టానాన్ని ఒప్పించి టికెట్‌ సాధించి.. బరిలో తలపడాలని, ఓటర్ల మనసు గెలిచి పీఠం దక్కించుకోవాలని పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశం ఇస్తే రూ.కోట్లు ఖర్చు చేయడానికి వెనకాడబోమంటూ భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ టికెట్ట కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతుండడంతో పోటీ రసవత్తరంగా మారుతూ మున్సిపల్‌ రాజకీయాలు వేడెక్కాయి. టికెట్‌ ఎవరిని వరిస్తుందో? బరిలో నిలిచేదెవరో? గెలిచేదెవరో అన్న ఆసక్తి పట్టణ ప్రజల్లో పెరిగిం ది. అభ్యర్థుల ఎంపికపై పార్టీలకు ఉన్న లెక్కలెన్నో. ఆశావహుల లెక్కలు... సామాజిక సమీకరణాలు.. రాజకీయ సమీకరణలు, కూటమి పొత్తులు పార్టీ నాయకత్వానికి సవాల్‌గా మారుతున్నాయి. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

జిల్లాలో కర్నూలు నగరపాలక సంస,్థ ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలు, గూడూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం చైర్మన్ల రిజర్వేషన్ల ఖరారు చేయగా, మంగళవారం వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. 2021 ఎన్నికల వరకు నగరంలో కార్పోరేటర్లు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లన్లు ఓటర్లు ఎన్నుకుంటే తర్వాత సభ్యులు చైర్మన్‌ను ఎన్నుకునేవారు. ప్రస్తుతం ఓటర్లే మేయర్‌, చైర్మన్లను ‘ప్రత్యక్ష విధానం’లో ఎన్నుకోనున్నారు. ఓటరు ఒక ఓటు చైర్మన్‌కు, మరో ఓటు వార్డు కౌన్సిలర్‌కు వేయాల్సి ఉంటుంది. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో మేయర్‌ పీఠం, చైర్మన్‌ కుర్చీలు దక్కించుకోవడానికి ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్‌ తమకే దక్కుతుందనే ఆశతో కొందరు అప్పుడే వ్యూహాత్మక రాజకీయాలకు తెరతీస్తే, తమకు అవకాశం కల్పించాలని నాయకులు చుట్టూ కొందరు ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఆర్థిక, సామాజిక బలం కీలకం

చైర్మన్‌ అభ్యర్థుల ఎంపికలో ప్రధానంగా ఆర్థిక స్థోమత, అంగ బలం, సామాజిక బలం ఈ మూడు అంశాలు ఆధారంగా ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికకు కొలమానంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. 2021లో జరిగిన ఎన్నికల్లో అప్పటి వైసీపీ అరాచకాలు, దౌర్జాన్యాలు ఎదుర్కోలేక నాటి ప్రధాన ప్రతిపక్ష టీడీపీ చేతులెత్తేసింది. ‘ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం.. పోటీ చేయం..’ అంటూ తేల్చేసింది. ‘స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోకపోతే.. నియోజకవర్గం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేదిలేదు..’ అంటూ వైసీపీ అధినేత, సీఎం జగన్‌ తేల్చిచెప్పడంతో వైసీపీ నాయకులు బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. కర్నూలు మేయర్‌గా బరిలో దిగే అభ్యర్థి ఎంత తక్కువ కాదన్నా రూ.8-10 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆదోని చైర్మన్‌ అభ్యర్థి రూ.5-6 కోట్లు, ఎమ్మిగనూరు చైర్మన్‌ అభ్యర్థి రూ.4-5 కోట్లు, గూడూరు చైర్మన్‌ అభ్యర్థి ఎంత తక్కువ కాదన్నా రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక బలం ప్రధాన అర్హతగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కర్నూలు నగరపాలక సంస్థ మేయర్‌ పీఠం ఎస్సీ మహిళకు రిజ ర్వు అయ్యింది. టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ మాజీ కార్పోరేటర్‌ బొల్లెద్దుల విజయ ప్రత్యూష అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయినప్పటికీ ప్రకటన రావాల్సి ఉంది. మంత్రి టీజీ భరత్‌ మద్దతు కూడా ఆమెకే ఉన్నట్లు సమాచారం. టీడీపీ నాయకుడు జూటూరు రవి తన భార్య నంద సంధ్యారాణి, పాణ్యం నియోజకవర్గం కస్టర్‌ ఇన్‌చార్జి భాస్కర్‌ భార్య కొప్పుల లావణ్య కూడా ఆశిస్తున్నారు. రిటైర్డ్‌ ఎస్‌బీఐ క్యాష్‌ ఆఫీసర్‌ ఎస్‌.సుమతి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. వైసీపీ అభ్యర్థిగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ భార్య సుశీలమ్మ పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. వైసీపీ నా యకులు ఆదిమూలపు సతీశ్‌ భార్య స్టెల్లా సలినా, సీహెచ్‌ మద్ద య్య కూతురు డాక్టర్‌ సీహెచ్‌ రాణి, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య కోడలు కూడా వైసీపీ నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు..

ఆదోని మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం జనరల్‌ మహిళలకు రిజర్వు చేయడంతో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కూటమి పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి కేటాయిస్తారు..? అనే ఉత్కంఠ టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో ఉంది. టీడీపీ టికెట్‌ కోసం నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనానాయుడు కుమారుడు, తెలుగు యువత రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కె.భూపాల్‌ చౌదరి భార్య కె.సత్యమ్మ, ఏపీ కమ్మ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సూర్యనాయరణ అలియాస్‌ సూరి భార్య సువర్ణలు ఆశిస్తున్నారు. జనసేనకు కేటాయిస్తే ఆ పార్టీ ఇన్‌చార్జి ఎన్‌.మల్లప్ప సతీమణి స్వప్న నాయకర్‌, బీజేపీకి కేటాయిస్తే మాజీ కౌన్సిలర్‌ వెల్లాల లలితా మదుసూధన్‌శర్మలు ఆశిస్తున్నారు. వైసీపీ టికెట్‌ కోసం ఆ పార్టీ నాయకుడు నగరూరు చంద్రశేఖర్‌రెడ్డి భార్య మాజీ కౌన్సిలర్‌ లక్ష్మిదేవి, యువనాయకుడు సందీ్‌పరెడ్డి భార్య గాజుల ప్రణతి ఆశిస్తున్నారు.

ఎమ్మిగనూరు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం అన్‌ రిజర్వ్‌డ్‌ చేసినా, ఇక్కడ బీసీ చేనేతలు అధికంగా ఉండడంతో ఆ సామాజికవర్గం నుంచే టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. చేనేత పితామహుడు, దివంగత పద్మశ్రీ మాచాని సొమప్ప (ఎంజీ) కుటుంబానికి చెందిన మున్సిపల్‌ దివంగత మాజీ చైర్మన్‌ మాచాని శివన్న మనవడు, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్డర్‌ మాచాని సోమనాథ్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాచాని మహేశ్‌కుమార్‌లు టీడీపీ టికెట్‌లు ఆశిస్తున్నారు. సోమనాథ్‌ రెండు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిని కలసి, విజయవాడ కేంద్రం టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంజీ కుటుంబం నుంచి మరో వ్యక్తిని కూడా బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులు ఉన్నవారికే టికెట్‌ దక్కుతుందనే చర్చ ఉంది. వైసీపీ టికెట్‌ కోసం ఏపీ శాప్‌నెట్‌ మాజీ చైర్మన్‌ మాచాని వెంకటేశ్‌ పేరు దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థానంపై బుట్టా వర్గీయులు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు.

గూడూరు నగర పంచాయతీ చైర్మన్‌ పీఠం బీసీ మహిళకు రిజర్వ్‌ చేశారు. టీడీపీ టికెట్‌ కోసం ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు భార్య వెంకటేశ్వరమ్మ ఆశిస్తున్నారు. బీజేపీకి కేటాయిస్తే ఆ పార్టీ నాయకుడు డమాం సురేశ్‌ భార్య సునితాబాయ్‌ ఆశిస్తున్నారు. వైసీపీ టికెట్‌ కోసం మాజీ వైస్‌ చైర్మన్‌ అస్లామ్‌ భార్య జహిదా బేగం, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లు భార్య పద్మావతిలు ఆశిస్తున్నారు.

కర్నూలు కార్పొరేషన్‌లో వార్డుల రిజర్వేషన్‌ ఖరారు

మహిళలకు 50 శాతం కేటాయింపు

అన్‌రిజర్వ్‌డ్‌ స్థానాలు 16

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ పరిదిలోని 68 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి మంగళవారం గెజిట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా గెజిట్‌లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. మొత్తం 68 వార్డుల్లో 34 వార్డులు అంటే 50 శాతం కేటాయించారు. ఈ నేపథ్యంలో ఓటర్లను బట్టి ఆయా రాజకీయ పార్టీల నాయకులు తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. కర్నూలు నియోజకవర్గం పరిధిలోకి 42 వార్డులు రాగా పాణ్యం నియోజకవర్గం పరిధిలో 22 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలోని నాలుగు వార్డులు కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలోకి వస్తాయి. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని ఒక వార్డు ఎస్టీ కేటగిరీ కేటాయించారు. ఈ క్రమంలో బుధవారం ఎన్నికల నోటిఫికేషన్‌ మధ్యాహ్నం లోపు వస్తుంది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డుల రిజర్వేషన్లు ఇలా...

ఎస్టీ జనరల్‌ (1) : వార్డు 46

ఎస్సీ మహిళ (6) : వార్డులు 20,21,28,37,44,68

ఎస్సీ జనరల్‌ (6) : వార్డులు 2,23,31,40,52,62

బీసీ మహిళ (10) : వార్డులు

4,7,8,11,13,19,43,49,50,56

బీసీ జనరల్‌ (11) : వార్డులు

3,5,9,12,14,18,39,41,48,51,65

జనరల్‌ మహిళ (18) : వార్డులు

1,16,17,22,24,29,30,33,35, 36,38,42,45,57,59,60,63,67

అన్‌ రిజర్వ్‌డ్‌ (16) : వార్డులు

6,10,15,25,26,27,32,34,47,53,54,55,56,58

Updated Date - Oct 14 , 2026 | 12:08 AM