ప్రేమ పెళ్లి తెచ్చిన తంటా..
ABN , Publish Date - May 28 , 2026 | 12:22 AM
ప్రేమ పెళ్లి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మండలంలోని డి.బెలగల్ గ్రామంలో బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రెండు వర్గాలు రాళ్లు, కట్టెలతో దాడి
ముగ్గురికి తీవ్ర గాయాలు
కోసిగి, మే 27 (ఆంధ్రజ్యోతి): ప్రేమ పెళ్లి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మండలంలోని డి.బెలగల్ గ్రామంలో బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాల వీధిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి తీవ్ర రక్త గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన మాల బసలింగప్ప చెల్లెలి కుమార్తె కొన్ని రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఒక యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈపెళ్లికి ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాల పద్మ భర్త రామయ్యే ప్రధాన కారకుడని బసలింగప్ప కుటుంబం మస్తాపానికి గురైంది. ఈ క్రమంలో మంగళవారం కోసిగి సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం దగ్గర బసలింగప్ప, ఆయన కుమారుడు వినోద్ రామయ్యను నిలదీసి దండించారని, ఈ ఘటనను మనసులో ఉంచుకుని మాజీ సర్పంచ్ మాల పద్మ భర్త రామయ్య, బసప్ప, పద్మ, ఈరేషమ్మతో పాటు మరో ఇద్దరు కలిసి బుధవారం ఉదయ మాల బసలింగప్ప, వినోద్‌ల ఇంటిపైకి వెళ్లారు. రాళ్లు, కట్టెలతో ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బసలింగప్ప, వినోద్‌కు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఇదే సమయంలో జరిగిన ఎదురు దాడిలో మరో వర్గానికి చెందిన బసప్ప తలకు కూడా గాయమైంది.
ఈ ఘర్షణలో మొత్తం ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ సర్పంచ్ పద్మ, ఆమె భర్త రామయ్య, బసప్ప, వీరేశమ్మతో పాటు మరో ఇద్దరిపై, అలాగే బసలింగప్ప, వినోద్‌పై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ డి.రమే్‌షరెడ్డి తెలిపారు.